పెద్దపల్లి జిల్లా రామగుండంలో దేశంలోనే నీటిపై తేలియాడే అతిపెద్ద సోలార్ పవర్‌ప్లాంట్ నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా కొంత ఆలస్యమైనా ప్రస్తుతం తుదిదశకు చేరుకుంది. 100 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో... బీహెచ్ఈఎల్ నిర్మిస్తున్న ఈ ప్లాంట్ వచ్చే నెల నుంచి దశలవారీగా విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. దేశవ్యాప్తంగా 450 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణం చేపడుతున్న ఎన్టీపీసీ అందులో భాగంగా రామగుండంలో ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. రామగుండం ఎన్టీపీసీలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌పై మొత్తం 450 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. పనులు చివరి దశకు చేరుకోవడంతో నీటిపై తేలియాడే సౌర పలకలు కనువిందు చేస్తున్నాయి. రిజర్వాయర్ ఉపరితలంపై 430కోట్లతో నిర్మిస్తుండటంతో అదనపు భూసేకరణ అవసరం లేదని... ఎన్టీపీసీ అధికారులు చెబుతున్నారు. ఆ ప్రాజెక్టు అనుభవం భవిష్యత్తులో ఉపయోగపడనుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి
రామగుండంతో పాటు కేరళలోని కయంకుళంలో 92 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, సింహాద్రిలో 25 మెగావాట్ల యూనిట్‌ను ఎన్టీపీసీ ఏర్పాటు చేస్తోంది. తమిళనాడులోని ట్యూటికోరన్ సమీపంలోని ఎట్టాయపురంలో 230 మెగావాట్ల గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టులో మరిన్ని తేలియాడే ప్లాంట్ల ఏర్పాటుపై ఎన్టీపీసీ దృష్టి సారించనుంది.
ఇదీ చదవండి: NAGARJUNA SAGAR: సాగర్ ప్రాజెక్టు నిర్వహణకు నిధుల కటకట