పెద్దపల్లిజిల్లాను అతలాకుతలం చేసిన వరదబీభత్సంలోనూ ప్రజలతో మమేకమయ్యారు రామగుండం, మంథని ఎమ్మెల్యేలు. ఆయా ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న మంథని, రామగుండం నియోజకవర్గాల్లో జనవాసాల్లోకి చొచ్చుకుని వస్తున్న వరద నీటిలోనూ పర్యటించి భేష్ అనిపించుకున్నారు.
గోదావరిఖనిలో జలమయమైన కాలనీల్లో పడవల్లో తిరుగుతూ స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరదల్లో చిక్కుకున్న సుమారు 50 మందిని బోట్ల సాయంతో.. సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియలో కోరుకంటి స్వయంగా పాల్గొన్నారు. అలాగే ఇంటెక్‌వెల్‌లో చిక్కుకున్న ఏడుగురు కార్మికులను కాపాడేందుకు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించి వారిని కాపాడడంలో తనవంతు బాధ్యత నిర్వర్తించారు.
మంథనితోపాటు గోదావరి పరీవాహకంలో పలు గ్రామాలు జలగిద్బంధంలో కొట్టుమిట్టాడుతున్నాయి. మంథని వ్యవసాయ మార్కెట్లోని రేషన్‌షాపులకు సరఫరా చేసే ఎంఎల్ఎస్ పాయింట్ ఉండగా.. భారీ వర్షాలతో వర్షపునీటిలో మునిగిపోయింది. సుమారు 2 వేల 600 క్వింటాల్ బియ్యం పూర్తిగా తడిసిపోయాయి. నెల రోజుల క్రితం ప్రారంభించిన మాతాశిశుకేంద్రం పూర్తిగా నీట మునిగింది. పట్టణంలోని అంబేడ్కర్ నగర్, మర్రివాడ, లైన్‌గడ్డ, గొల్లగూడెం.. భగత్‌నగర్, హుస్సేనీపురా, దొంతులవాడ నీట మునిగాయి.
మంథనికి దిగువన బొక్కలవాగు నీరు గోదావరి నదిలో కలవాల్సి ఉన్నా.. నదిలో ప్రవాహం తీవ్రంగా ఉండడంతో ఆ నీరు వెనక్కి వచ్చివంతెన మీదుగా ప్రవహించింది. అలాగే సూరయ్యపల్లి జలదిగ్బందనలో చిక్కుకుంది వివిధ వీధుల గుండా స్థానిక ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముంపునకు గురైన ప్రాంతాల్లో తిరుగుతూ.. బాధితులకు భరోసా కల్పించారు. పోతారం గ్రామంలో నాటు పడవలో తిరిగిన ఆయన.. వరదలతో అతలాకుతలమైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. వరద పోటెత్తిన ప్రతి ప్రాంతంలోని వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రజాప్రతినిధులు చేసిన ప్రయత్నాలపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.