నగర అభివృద్దే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని, అధికారులు అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో పనిచేయాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రామగుండం నగర మేయర్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు. పట్టణాల అభివృద్దికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.100 కోట్ల నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పన ప్రజాప్రతినిధుల కర్తవ్యమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులతో ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.
గతంలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పెండింగ్ పనులు పూర్తిచేయాలన్నారు. అధికారులు తమకు ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే అన్నారు. నగర అభివృద్దే అందరి లక్ష్యంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కోసం తవ్విన రోడ్డును సంబంధిత కాంట్రాక్టర్లు పూర్తి చేసేలా అధికారులు చూడాలన్నారు. లాక్డౌన్ తర్వాత పెండింగ్ పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి: 'ఇక్కడ కాదు.. పోతిరెడ్డిపాడులో ధర్నా చేయాలి'