పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం కోసం ఎన్టీపీసీ యాజమాన్యం స్థలం కేటాయించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం నియోజకవర్గం పరిధిలో సుమారు 20 వేల మంది ఒప్పంద, అసంఘటిత రంగ కార్మికులున్నారని... వారి కోసం 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి మంజూరైందని తెలిపారు. ఎన్టీపీసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో భాగంగా సీజీఎం సునీల్ కుమార్, హెచ్వోహెచ్ఆర్ విజయలక్ష్మీ మురళీధర్‌తో ఆయన మాట్లాడారు.
కాంట్రాక్టు కార్మికుల పిల్లల కోసం ఎన్టీపీసీ యాజమన్యం ఆధ్వర్యంలో ఒక పాఠశాలను ఏర్పాటు చేయాలన్నారు. మరణించిన కాంట్రాక్టు కార్మికుల వారసులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల్లోని ప్రజలను ఒప్పంద ఉద్యోగులుగా తీసుకోవాలన్నారు. ఆ గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు ఎన్.వి.రమణారెడ్డి, కల్వచర్ల కృష్ణవేణి, రామారావు, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఊర కుక్కేకదా అని ఊరికే వదిలేయలేదు...