కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలు రైతులకు వ్యతిరేకంగా వారిని అణగదొక్కేలా ఉన్నాయని మండిపడ్డారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
రామగిరి మండలంలోని సుందిళ్ల, రత్నాపూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన రైతు భవనాలను ప్రారంభించారు. సుందిళ్ల కమ్యూనిటీ భవనానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్ నేత, జడ్పీ ఛైర్మన్ పుట్టమధు, భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. సుందిళ్ల గ్రామపంచాయతీకి... ఉత్తమ గ్రామపంచాయతీగా అవార్డు దక్కగా సర్పంచ్ దాసరి లక్ష్మీ-రాజలింగలను మంత్రి కొప్పుల ఈశ్వర్ సన్మానించారు.
అనంతరం మంథని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తడి చెత్త- పొడి చెత్త స్వచ్ఛ ట్రాలీ ఆటోలను ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భూమిని కోల్పోయిన రైతులు అందరికీ పరిహారం అందే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్ల పల్లెలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లొచ్చని మంత్రి సూచించారు. రత్నాపూర్లో రైతువేదిక ప్రారంభోత్సవం అనంతరం మంత్రిని సర్పంచ్ శాలువా కప్పి గజమాలతో సత్కరించారు. సెంటినరీ కాలనీలో సావిత్రి భాయి- జ్యోతిరావు పూలే జంట విగ్రహలను ప్రారంభించారు.