కాళేశ్వరం ప్రాజెక్టు.. రాష్ట్రానికి వర ప్రదాయిని అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సమ్మక్క- సారలమ్మ వద్ద ఉన్న గోదావరిలో రాష్ట్ర స్థాయి తెప్పల పోటీలను మంత్రి ప్రారంభించారు. సముద్రంలో కలిసే నీటిని ఒడిసిపట్టి రాష్ట్రాన్ని నీటితో నిండుకుండలా చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నాన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలతో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు.
మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని... చేపల పెంపకానికి ప్రోత్సాహం కల్పిస్తుందన్నారు. ఒకప్పుడు ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి చేపలను దిగుమతి చేసుకునే వారని... ఇప్పుడు ఆ అవసరమే లేదన్నారు. ప్రతి ఏటా తెప్పల పోటీలను నిర్వహించడం ఎంతో హర్షణీయమన్న మంత్రి... నిర్వాహకులను అభినందించారు. సాయంత్రం వరకు గోదావరి నదిలో తెప్పల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, సుంకె రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.