రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి మనం చేరడం గర్వకారణమన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం గోపాల్పూర్ గ్రామంలో మానేరు వాగుపై నిర్మించే చెక్‌డ్యాం శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
మంథని నియోజకవర్గంలో ఆరు చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.110 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆరేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు రూపాయి ఖర్చు లేకుండా నీరు ఇస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం రైతుబంధు పథకం, రైతు వేదికల నిర్మాణం జరిగిందని తెలిపారు. రైతులు లాభసాటి వ్యవసాయం చేసేందుకు రైతు వేదికలు కేంద్రాలుగా మారబోతున్నాయని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
గత పాలకులు రైతులను పట్టించుకోలేదు..
గత ప్రభుత్వాలు రైతులను గాలికి వదిలేశాయని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం రైతులకు అనేక విధాలుగా అండగా నిలుస్తోందని అన్నారు. మంథని నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం నిధులు విడుదల చేశామని తెలిపారు. కరోనా ప్రభావం తగ్గినా.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్లో మాజీ ఎమ్మెల్సీ గీట్ల జనార్దన్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, మంథని మున్సిపల్ ఛైర్మన్ పుట్ట శైలజ తదితరులు పాల్గొన్నారు.