పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం నుంచి 'ఛలో మల్లారం' కార్యక్రమానికి బయలుదేరుతున్న మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్లారం గ్రామంలో గత నెల 6న జరిగిన ఎస్సీ యువకుడి హత్య, ఎస్సీలపై అత్యాచారాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం 'ఛలో మల్లారం' కార్యక్రమానికి పిలుపునిచ్చింది. హత్య విషయంలో మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని, ఎస్సీ యువకుడి హత్యకు నిరసనగా టీపీసీసీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు నాగరిగారి ప్రీతం పిలుపు మేరకు కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున తరలి రావడానికి బయల్దేరడం వల్ల పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేశారు.
అనుమతి లేకుండా బయటికి వెళ్లడానికి ప్రయత్నించడం వల్ల పోలీసులు శ్రీధర్‌బాబును అరెస్టు చేసి వాహనం ఎక్కించడంతో కార్యకర్తలు ఆ వాహనం ముందు బైఠాయించారు. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు కార్యకర్తలను పక్కకు లాగి శ్రీధర్‌బాబు పోలీస్‌స్టేషన్ తరలించారు. మంథని పీఎస్‌కు శ్రీధర్‌బాబును, కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసులు తీసుకెళ్లగా... అదే సమయంలో తెరాస కార్యకర్తలను కూడా తీసుకురావడం వల్ల ఇరువర్గాల వారు నినాదాలు చేసుకోవడం వల్ల ఉద్రిక్తత నెలకొంది. వెంటనే పోలీసులు రెండు వర్గాలను శాంతింపజేసి తెరాస కార్యకర్తలను రామగిరి పీఎస్‌కు తరలించారు.
అనంతరం శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎస్సీ బిడ్డలను హత్య చేస్తూ ఉంటే అరాచకాలను ప్రశ్నించడానికి ఈ రోజు ఛలో మల్లారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంథని ఎమ్మల్యే శ్రీధర్ బాబు అన్నారు. పోలీసులు అందరికీ సమానమేనని, ఒకరి ఒత్తిడితో ఒకే వర్గానికి అనుకూలంగా ఉండటం భావ్యం కాదని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం చేసే తప్పులను చూపించడం మా బాధ్యత అన్నారు. ఎస్సీలపై అరాచకాలను, దాడులను ఆపాలని, మృతి చెందిన ఎస్సీల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, భవిష్యత్‌లో దళితులపై దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: టీపీసీసీ నేతలు ఉత్తమ్, భట్టిని అదుపులోకి తీసుకున్న పోలీసులు