రాష్ట్రంలో కరోనా అదుపులోకి వస్తుండటం వల్ల కొన్ని రంగాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో బీడీ తయారీ నిర్వహణ కంపెనీలు, సిమెంట్ కంపెనీలు, ఇసుక తరలింపు, సిరామిక్స్ పరిశ్రమలు, దుకాణాలు, జిన్నింగ్, స్టీలు, గ్రానైట్, ప్లాస్టిక్ పైపులు విక్రయించే దుకాణాలు, కాటన్ పరిశ్రమ ఇలా 15 రకాల రంగాలకు లాక్‌డౌన్ ఆంక్షలు సడలించారు.
ఇప్పటికే భవన నిర్మాణ రంగంలో ఇసుక, సిమెంట్ కొరత ఏర్పడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. జిల్లాలో బసంత్‌నగర్ సిమెంట్ పరిశ్రమ, 7 ఇసుక క్వారీలు, 42 గ్రానైట్, 22 క్రషర్లు, 100 ఇటుక బట్టీల్లో పనులు పునఃప్రారంభం కానున్నాయి.
కార్మికులకు ఉపాధి:
పలు రంగాలో ఆంక్షలు ఎత్తివేయడంతో ఆయా పరిశ్రమల్లో పనులు చేస్తున్న కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగు కానున్నాయి. జిల్లాలో పలు రంగాల్లో 20వేలకు పైగా కార్మికులు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితం కావడంతో కుటుంబాల పోషణ ఇబ్బందిగా మారింది. ఎట్టకేలకు నిబంధనలు సడలించడంతో తిరిగి పనుల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
అభివృద్ధి పరుగులు:
గ్రామీణ ప్రాంతాల్లో భవన నిర్మాణాలు, అభివృద్ధి పనులు పరుగు తీయనున్నాయి. గ్రామాల్లో మంజూరైన నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ సిమెంట్, ఇసుక, కూలీల కొరత ఏర్పడి పనులు నిలిచిపోయాయి. సడలింపుతో వివిధ పథకాల్లోని పనులు ముందుకు సాగనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పలు రంగాలకు సడలింపు ఇచ్చినట్లు అదనపు పాలనాధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతిస్తామన్నారు.