KTR Peddapalli Road Show : తెలంగాణ ప్రజలకు రైతుబంధు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా లేదా.. దాన్ని ఆపాలనుకుంటున్న కాంగ్రెస్ రాబంధులు కావాలా అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. చావునోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఈ దేశంలో రైతుబంధును (Raithu Badhu) పరిచయం చేసింది సీఎం కేసీఆర్ (KCR) అని తెలిపారు. 1956లో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌తో కలిపిందని ఆ తప్పు వల్ల దాదాపు 50 ఏళ్లు బాధపడ్డామని గుర్తు చేశారు.
KTR Fires on Congress Past Ruling : కర్ణాటకలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రాగానే.. అక్కడ కరెంటు పోయిందని కేటీఆర్ తెలిపారు. డిసెంబర్ 3 తర్వాత ప్రతి మహిళ ఖాతాలో నెలకి రూ.3 వేలు వేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గెంతును నొక్కాలని దిల్లీ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. మన్మోహన్సింగ్ హయాంలో రూ.400 సిలిండర్‌ను రూ.1200కు పెంచారని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రేషన్‌కార్డులు ఉన్నవారికి సన్నబియ్యం ఇస్తామని.. తెల్లరేషన్ కార్డుదారులకు రూ.5 లక్షల జీవితబీమా చేస్తామని వెల్లడించారు.
"కేసీఆర్ ఏం తప్పు చేశారని ఇంటికి పంపించాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే.. ఎవరికీ న్యాయం జరగదు. కేసీఆర్ మూడోసారి గెలిస్తే.. కొత్త పథకాలు తీసుకవస్తాం. సౌభాగ్యలక్ష్మి పథకం కింద మహిళల ఖాతాలో నెలకు రూ.3 వేలు వేస్తాం. ఓటు వేసే ముందు గ్యాస్ సిలిండర్‌కు మొక్కాలని 2014లో మోదీ అన్నారు. గెలిచిన మోదీ రూ.400 గ్యాస్ సిలిండర్‌ను రూ.1200కు పెంచారు. కేసీఆర్‌ను మళ్లీ గెలిపిస్తే.. రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. కరెంట్ కావాలో.. కాంగ్రెస్ కావాలో ఆలోచించాలి. ఇప్పటికే 11 సార్లు రైతుబంధు ఇచ్చిన కేసీఆర్.. 12వ సారి కూడా ఇస్తారు. ధర్మపురి నియోజకవర్గంలో ఎస్సీలందరికీ రైతుబంధు ఇస్తాం." - కేటీఆర్ బీఆరఎస్ మంత్రి.
'బీఆర్ఎస్ ఎప్పటికీ సెక్యులర్ పార్టీనే - తల తెగిపడినా దిల్లీ నేతలకు తలవంచం'
KTR On Rythu Bandhu Funds Issue : పెద్దపల్లి రోడ్‌షో అనంతరం మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లాలోని వెల్గటూరులో పర్యటించారు. అక్కడ నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలు రైతుబంధు దుబారా అంటున్నారని మండిపడ్డారు. ధరణీ రద్దు చేసి పట్వారీ వ్యవస్థను తీసుకొస్తామని హస్తం నేతలు అంటున్నారని తెలిపారు. 11సార్లు అవకాశమిస్తే ఆ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందే కాంగ్రెస్ పార్టీ రైతుబంధును ఆపిందంటూ విమర్శించారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.
'70 లక్షల రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్లు వేసిన ఘనత కేసీఆర్‌దే'