పెద్దపల్లి జిల్లాలో నడిరోడ్డుపై దారుణ హత్యకు గురైన న్యాయవాద దంపతుల కుటుంబాన్ని హైకోర్టు న్యాయవాదులు, న్యాయ, ప్రజా పోరాట కమిటీ సభ్యులు పరామర్శించారు. వామనరావు, నాగమణిల హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని న్యాయవాదులు పేర్కొన్నారు. దంపతుల స్వగ్రామమైన గుంజపడుగు గ్రామానికి చేరుకొని వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. ఇది రాజకీయ, కక్షపూరిత హత్య అని.. న్యాయవాదులను ఎదుర్కొనలేక ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఆరోపించారు. హత్యకు గల కారణాలను ఆయన కమిటీ సభ్యులకు వివరించారు.
పోరాటం ఆగదు..
ఘటన జరిగి నేటికి 34 రోజులైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. అడ్వకేట్ల రక్షణకు ప్రభుత్వం వెంటనే చట్టం చేయాలని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి రూ. 5 కోట్ల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని వెల్లడించారు. న్యాయవాద దంపతుల హత్యపై సంపూర్ణ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని మీడియాకు తెలిపారు.
ఇదీ చదవండి: తెలంగాణ భవన్ వద్ద గన్‌తో తెరాస నాయకుడి హల్చల్