రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం పగడ్బందీ చర్యలు చేపట్టినట్లు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన కరోనా వార్డును పర్యవేక్షించారు. ప్రభుత్వ అదేశాల మేరకు జిల్లా కేంద్రాలతో పాటు ప్రధాన ఆసుప్రతుల్లో కరోనా వార్డులను ఏర్పాటు చేశామని వెల్లడించారు. కరోనా బారిన పడినవారు ఎలాంటి భయాందోళనాలకు గురికాకుండా ఇంటి వద్దనే చికిత్స తీసుకోవాలని తెలిపారు.
అత్యవసరమైనా రోగుల కోసం ప్రభుత్వ ఆసుప్రతిలో 30 ఆక్సిజన్ పడకలతో పాటు మరో 20 సాధారణ పడకలు అందుబాటులో ఉంచామన్నారు. కరోనా వార్డుకు ప్రత్యేక వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా మహమ్మరి వ్యాపిస్తోన్న క్రమంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు రక్షణ సూత్రాలు పాటిస్తూ, రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.