Halting Problems at Peddapalli Railway Station: పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ రైలుమార్గానికి 1993లో దివంగత ప్రధాని పీవీ నరసింహారావు భూమి పూజచేశారు. దశాబ్దాల కాలంగా సాగిన ఆ పనులు కొన్నాళ్ల క్రితమే పూర్తై రైళ్లరాకపోకలు మొదలయ్యాయి. ఇటీవల విద్యుద్దీకరణ పనులు పూర్తి కావడంతో క్రమంగా ఈ మార్గంలో రైళ్ల సంఖ్య పెరుగుతోంది. వాటితో పాటు దిల్లీ, కాజీపేట, వరంగల్ వైపు వెళ్లే రైళ్లకు పెద్దపల్లి స్టేషన్ జంక్షన్‌గా మారడంతో ప్రయాణికుల సంఖ్య భారీగా ఉంటోంది. ఐతే రైళ్లసంఖ్య పెంచాల్సిన అధికారులు... ఉన్నవాటినే తొలగించడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. వందల సంఖ్యలో రైళ్లు పెద్దపల్లి రైల్వేస్టేషన్ మీదుగా వెళుతున్నా హాల్టింగ్ మాత్రం ఇవ్వలేదు.
రెండేళ్ల క్రితం కరోనా విజృంభణతో పలు రైళ్లకు హాల్టింగ్‌ను అధికారులు ఎత్తివేశారు. వాటిని తిరిగిన పునరుద్ధరించలేదు. అంతేకాకుండా రైల్వే పోలీస్‌స్టేషన్‌తో పాటు కమర్షియల్ ఇన్స్‌పెక్టర్ కార్యాలయాన్ని రామగుండానికి తరలించారు. రైల్వేస్టేషన్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లిలో హాల్టింగ్ ఉన్నదక్షిణ్ ఎక్స్‌ప్రెస్ పనరుద్దరించినా హాల్టింగ్ మాత్రం ఇవ్వలేదు. మరోవైపు కరీంనగర్ ముంబాయి ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఆనంద్‌వన్-తడోబా ఎక్స్‌ప్రెస్‌ల పునరుద్దరణ జరగలేదు. రాష్ట్రంలో కొత్తగా జిల్లా కేంద్రాల్లో కేవలం మంచిర్యాలలో మాత్రమే ఎక్కువ రైళ్ల హాల్టింగ్ ఉంది. జిల్లా కేంద్రాలైన పెద్దపల్లి, జనగామ, భువనగిరి రైల్వేస్టేషన్ల పరిస్థితి దయనీయంగా ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి దిల్లీ, విశాఖపట్నం, చెన్నై వెళ్లాలంటే తప్పనిసరిగా వరంగల్ లేదా సికింద్రాబాద్ వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు.
పెద్దపల్లిలో జంబో ర్యాక్‌షెడ్‌తో ప్రతినెలా కోట్లలో ఆదాయం వస్తుండగా ప్రయాణికుల టికెట్ల ద్వారా నిత్యం రెండు లక్షల వరకు లాభం సమకూరుతోంది. మంచి ఆదాయం ఉన్నా అధికారులు మాత్రం రెండింటినే నడిపిస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైళ్ల రాకపోకలపై ప్రశ్నించాల్సిన పెద్దపల్లి ఎంపీ ఎప్పుడు పట్టించుకున్న దాఖలాలు లేవనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కేంద్రంగా పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ ఇస్తే కరీంనగర్‌తో పాటు జగిత్యాల, సిరిసిల్ల ప్రజలకు సదుపాయంగా ఉంటుందని పలువురు సూచిస్తున్నారు. రైల్వేస్టేషన్‌లో దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు హాల్టింగ్‌తోపాటు స్టేషన్‌లో ఎక్స్‌లేటర్ సదుపాయం కల్పించాలని జనం కోరుతున్నారు.
ఇవీ చదవండి: