కరోనాతో ఎవరైనా చనిపోతే.. ఆ మృతదేహాలను అంత్యక్రియల కోసం ప్యాక్ చేసి నగరపాలక సిబ్బందికి అప్పగించాలి. సాధారణంగా అయితే... మృతుల బంధువులకే పీపీఈ కిట్లు ఇచ్చి మృతదేహాలను ప్యాక్ చేయిస్తుంటారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతీయ అస్పత్రిలో కరోనాతో ఇద్దరు చనిపోయారు. వారి మృతదేహాలను ప్యాక్ చేసేందుకు కుటుంబసభ్యులేవరూ ముందుకు రాలేదు. వార్డుబాయ్లతో ఆ పని చేపించుదామనుకున్నా... వాళ్లు విధులకు రాలేదు.
ఇక ఆలస్యం చేయలేదు. ఎవరి నుంచి సాయం ఆశించలేదు. ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి రంగంలోకి దిగారు. తానే స్వయంగా మృతదేహాలను ప్యాక్ చేశాడు. ల్యాబ్ టెక్నీషియన్ శివ, సిబ్బంది సాయంతో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. సూపరింటెండెంటే స్వయంగా ఈ ప్రక్రియలో పాల్గొనటం సిబ్బందిలో స్ఫూర్తి నింపింది. ప్రజలు కూడా ఆయన చేసిన పనిని అభినందిస్తున్నారు.