పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని గోదావరి నదిలో గంగపుత్ర, ముదిరాజ్ యువతకు బోట్ డ్రైవింగ్, లైఫ్ గార్డ్, రెస్క్యూ ఆపరేషన్ల్లో శిక్షణ శిబిరాన్ని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రారంభించారు. అడ్వెంచర్ అండ్ ఆక్వా టూరిజం ఛైర్మన్ గోలివాడ ప్రసన్న కుమార్ బెస్త ఆధ్వర్యంలో కార్యాక్రమం కొనసాగుతోంది.
తెలంగాణలోనే మొదటిసారిగా..
రాష్ట్రంలో మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమాన్ని అడ్వెంచర్ అండ్ ఆక్వా టూరిజం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ శిక్షణ సంస్థలుగా పేరు గాంచిన యాచింగ్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ లైఫ్ సేవింగ్ సొసైటీ, వాటర్ వరల్డ్ ఆఫ్ ఇండియా, నేషనల్ లైఫ్ సేవర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా, లైఫ్ సేవింగ్ తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో 10 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో యువతకు ప్రత్యేక శిక్షణలో మెలకువలు నేర్పించారు.
రెండు ఎలక్ట్రిక్ బోట్లతో..
అడ్వెంచర్, అక్వా టూరిజం ఆధ్వర్యంలో బోటింగ్ డ్రైవింగ్, నీటిలో మునిగిన వారిని రక్షించటం సహా పలు విభాగాల్లో ట్రైనింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం రెండు ఎలక్ట్రిక్ బోట్లు, ట్రైనింగ్ కోసం అవసరమైన జాకెట్లు, పరికరాలను సమకూర్చి యువతకు శిక్షణ అందిస్తున్నారు.
పది రోజుల పాటు..
ఔత్సాహికులకు బోటింగ్ డ్రైవింగ్, ప్రమాదవశాత్తు నదిలో జారిపడిన వారిని రక్షించటం, బాధితులకు ప్రథమ చికిత్స , వరదలు వచ్చినప్పుడు కాపాడే విధానం, పరికరాల వినియోగం, ఈత నేర్పించటం లాంటి పలు విభాగాల్లో పది రోజుల పాటు శిక్షణ, థియరీ క్లాసులను నిర్వహించారు.
అవకాశాన్ని వినియోగించుకోవాలి..
శిక్షణ అనంతరం తెలంగాణ టూరిజంలో ఉపాధి అవకాశాలు అందిస్తామని అడ్వెంచర్ అండ్ ఆక్వా టూరిజం ఛైర్మన్ గోలివాడ ప్రసన్న కుమార్ బెస్త తెలిపారు. ట్రైనింగ్ విధానం ఏడాది పొడవున కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఔత్సాహికులు అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. గోదావరిలో బోట్ డ్రైవింగ్ సహా పలు విభాగాల్లో శిక్షణ ఇవ్వటం మంచి పరిణామని ట్రైనర్ మహేష్ వినోద్ హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరదపోటు.. 36 గేట్లు ఎత్తివేత