Baahubali Scene Repeat: పెద్దపల్లి జిల్లా మంథనిలో మర్రివాడను భారీ వరద ముంచెత్తింది. బొక్కలవాగు నీటి ప్రవాహానికి పలు గ్రామాలు నీటమునిగాయి. సూరయపల్లి, పోతారం , సిరిపురం, బెస్తపల్లి, విలోచవరం గ్రామాల్లోని ప్రజలను..... నాగారం రైతువేదిక, బెస్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావస ప్రాంతాలకు తరలించారు. మర్రివాడ మొత్తం జలదిగ్బంధం కాగా.. ఓ ఇంట్లోని కుటుంబసభ్యులు దగ్గర్లోని పైఅంతస్థుకు వెళ్లారు. అయితే.. ఆ ఇంట్లో రెండు నెలల బాబుతో పుప్పల సుమలత అనే బాలింత చిక్కుకుపోయింది.
తల్లీబిడ్డను ఎలాగైనా కాపాడాలని బంధువులు నిశ్చయించుకున్నారు. సుమలత బాలింత కావటంతో.. భుజాల వరకు వస్తున్న వరదల్లో నడిచేందుకు శరీరం సహకరించకపోవటం వల్ల ఇబ్బందిగా మారింది. అయితే.. తన అక్క కొడుకు రంజిత్.. సుమలతను గట్టిగా పట్టుకుని సాహాసోపేతంగా వరద ముంపు నుంచి ఒడ్డుకు చేర్చాడు. అయితే అదే సమయంలో.. పసిబిడ్డను భుజాన వేసుకుని వెళ్లేలా పరిస్థితులు లేకపోవటంతో.. బాబు వాళ్ల పెద్దనాన్న రామ్మూర్తి.. వినూత్నంగా ఆలోచించారు. ఇంట్లోని ఒక పెద్ద తట్టలో చంటిబిడ్డను పడుకోబెట్టి.. చలి తగలకుండా వెచ్చగా ఉండేలా చుట్టూ బట్టలు పెట్టాడు. బాహుబలి సినిమాను తలపించేలా.. ఆ బాబు ఉన్న తట్టను రెండు చేతులతో పైకెత్తి పట్టుకుని.. జాగ్రత్తగా నడుస్తూ సురక్షిత ప్రదేశానికి తీసుకువచ్చారు. బాలింతను చంటిబాబును తీసుకు వస్తున్న దృశ్యాన్ని వీడియో తీసిన యువకులు.. బాహుబలి సినిమాతో పోల్చుతూ వైరల్ చేస్తున్నారు.
ఇవీ చూడండి: