పత్తి తూకంలో మిల్లు యజమానులు మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గొల్లపల్లి రైతులు ఆందోళన నిర్వహించారు. గ్రామంలోని పరమేశ్వర కాటన్ ఆగ్రో ప్రొడక్ట్స్ మిల్లులో నిరసన చేపట్టారు. దీంతో రైతులకు, నిర్వాహకులకు మధ్య వాగ్వాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, తూనికలు కొలతల అధికారి, జిల్లా మార్కెటింగ్ అధికారి.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతుల సమక్షంలో కాంటా(వే బ్రిడ్జి)కు సంబంధించి సీలింగ్, పనితీరు, లోపాలేవైనా ఉన్నాయా అనే విషయాలపై పరిశీలనలు చేశారు. 80 టన్నుల సామర్థ్యం కలిగిన వే బ్రిడ్జ్ సక్రమంగానే పనిచేస్తుందని, తక్కువ తూకం వేసేందుకు మిల్లులో ప్రత్యేకంగా చిన్నపాటి కాంటాను ఏర్పాటు చేయలేదని గమనించారు. పెద్ద సామర్థ్యం కలిగిన కాంటాపై తక్కువ బరువు కలిగిన వాటిని తూకం వేయడం వల్ల తూకంలో తేడాలు వస్తున్నాయని గుర్తించారు. దీనివల్ల రైతులకు నష్టం కలుగుతుందని నిర్ధరించారు.
ఆదేశాలు జారీ
కాంటా ప్రక్కనే క్యాబిన్ ఏర్పాటు చేసి తూకం చూపించే విధంగా డిస్ప్లే ఏర్పాటు చేయాలని, రైతులకు రసీదులు వెంటనే అందించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చిన్న వాహనాల్లో తీసుకువచ్చిన పత్తిని తక్కువ సామర్థ్యం కలిగిన కాంటాపై తూకం వేయాలని ఆదేశించారు. రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిల్లు నిర్వాహకులపై కేసు నమోదు చేసి, జరిమానా విధిస్తున్నట్లు తూనికల అధికారి తెలిపారు.
ఇదీ చదవండి: ఈటీవీ భారత్ ఎఫెక్ట్: వరంగల్ వ్యవసాయ మార్కెట్ సూపర్వైజర్ సస్పెండ్