పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థలో కో- ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఎట్టకేలకు పూర్తయింది. 15 రోజుల క్రితం నిర్వహించాల్సిన ఎన్నికలు కోర్టు జోక్యంతో వాయిదా పడ్డాయి. కరోనా నేపథ్యంలో టెలి కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని అధికార పార్టీ భావించింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికలు నేరుగా నిర్వహించాలని కోర్టును ఆశ్రయించింది. అధికారులు ఈరోజు ఎన్నికలు నిర్వహించారు.
తెరాసకు చెందిన నలుగురు మొదటగా ఏకగ్రీవంగా ఎన్నిక కాగా... ప్రత్యక్ష పద్ధతి ద్వారా మద్దతు తెలపడం వల్ల మరో అభ్యర్థి మహమ్మద్ రఫీ ఎన్నికయ్యారు. ఐదుగురు తెరాసకు చెందిన సభ్యులను ఎన్నుకున్నట్లు నగర మేయర్ బంగి అనిల్ కుమార్ ప్రకటించారు.
ఎన్నికైన సభ్యులు తానిపర్తి విజయలక్ష్మి, చెరుకు బుచ్చిరెడ్డి, వంగ శ్రీనివాస్ గౌడ్, తస్లీమా బాను, మహమ్మద్ రఫీలకు ధ్రువీకరణ పత్రాన్ని అందించి, నగర కమిషనర్ ఉదయ్ కుమార్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం కో- అప్షన్ ఎన్నికల తరువాత ప్రజా సమస్యలపై చర్చించాలని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మేయర్‌ను కోరగా సమయం లేదని నిరాకరించారు. దీనిపై వారు నిరసన వ్యక్తం చేశారు.