రామగుండం కమిషనరేట్ పరిధిలో కొంత మంది దొంగబాబాలు చాలాకాలంగా అమాయకులను మోసం చేస్తున్నారు. జబ్బులు నయం చేస్తామంటూ, చేతబడిల నెపంతో ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఉద్యోగాలు వస్తాయని, అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తామని తదితర విషయాలపై భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ దందా కొనసాగిస్తున్నారు. తమ వద్దకు వచ్చే వారి ఆర్థిక పరిస్థితి గమనించి పూజలు, పూజా సామగ్రి పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు.
సమాచారం అందుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్, సీసీఎస్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి... దొంగ బాబాలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న పూజాసామగ్రి, తాయెత్తులు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. గోదావరిఖనికి చెందిన తూర్పాటి సమ్మయ్య, శంకర్, సారయ్యలు అడ్డగుంటపల్లిలోని అమాయకులను నమ్మించి మభ్య పెడుతున్నారని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. క్షుద్రపూజలకు 50 వేల నుంచి 60 వేల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారని వెల్లడించారు.
పెద్దపల్లికి చెందిన మేకల శకుంతల, నేదునూరి పద్మ గవ్వలతో పూజలు చేస్తూ బియ్యం, డబ్బులు వసూలు చేస్తున్నారని... రామగిరి మండలానికి చెందిన రవి ప్రకృతి వైద్యం పేరుతో, మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన సయ్యద్ కబీర్ తాయెత్తులు కడతామని మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
దొంగ బాబాల మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సీపీ సత్యనారాయణ సూచించారు. వారిలో చైతన్యం తీసుకురావడానికి ఎన్జీవోలతో కలిసి, కళా బృందాల ద్వారా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మంత్రగాళ్లను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని... అలాంటి వారు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై పీడి యాక్టు ప్రయోగిస్తామని హెచ్చరించారు.