బురదమయంతో రామగుండం రహదారులు పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని రోడ్లన్ని అధ్వానంగా తయారయ్యాయి. 50 డివిజన్లలో అభివృద్ధి పేరిట రోడ్లను తవ్వి.. డ్రైనేజీ పైపులైన్లతో పాటు తాగునీటి పైపులు వేసి నిర్లక్ష్యంగా వదిలేశారు. తవ్విన రోడ్లకు కనీసం తాత్కాలిక మరమ్మతులు కూడా చేయలేదు. ప్రధానంగా పారిశ్రామిక ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే అగ్ని మాపక వాహనం వెళ్లాలంటే బురదగుంటలో కూరుకుపోయే దుస్థితి నెలకొంది. అత్యవసర వాహనం వెళ్లే మార్గం కూడా గత రెండేళ్లుగా మరమ్మతులు చేయలేని పరిస్థితి. నగరపాలక సంస్థ వైపు ఒక రోడ్డు మినహా.. మార్కండేయ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ, శారద నగర్ ప్రాంతాల్లో రహదారులన్నీ బురదతో నిండిపోయాయి. అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టకున్న లాభం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కాలనీలో రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించినా.. పనులు ప్రారంభం కాలేదు.
పట్టణంలోని సప్తగిరి కాలనీ, శివనగర్, అడ్డగుంట పల్లి తదితర కాలనీల్లో రోడ్లన్నీ దారుణంగా తయారై.. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. బురద గుంటలో బస్సులు, ఆటోలు పడి ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రామగుండం నగరపాలక సంస్థలోని ప్రధాన రోడ్లకు మరమ్మతులు చేసి.. ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి : అరకొర వసతులతో అంగన్వాడీ కేంద్రాలు