కరోనా మహమ్మారి దశాబ్దాలుగా పెనవేసుకున్న మానవ బంధాలను సైతం చిదిమేస్తోంది. అలాంటి విషాదకర ఘటనకు వేదికైంది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని శ్రీరామ్‌నగర్ ప్రాంతం. స్థానికంగా సింగరేణిలో పనిచేసే ఉద్యోగి శ్వాస సంబంధిత వ్యాధితో దుర్మరణం చెందారు. కరోనాతోనే చనిపోయారనే అనుమానంతో ఇంటికి వచ్చిన మృతదేహాన్ని ముట్టుకునేందుకు కుటుంబసభ్యులు ముందుకురాలేదు. దీంతో ఆస్పత్రి నుంచి ఇంటికి చేరిన మృతదేహం ఉదయం 7 గంటల నుంచి వాహనంలోనే ఉండిపోయింది.
మంచిర్యాలలో సింగరేణి ఉద్యోగం చేసే ఐలయ్య గత నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున శ్వాస రాకపోవడం వల్ల అతడి బంధువులు గోదావరిఖని సింగరేణి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. అనంతరం ఓ ప్రైవేటు వాహనంలో ఐలయ్య మృతదేహం ఇంటికి చేరగా.. కరోనా అనుమానంతో కుటుంబసభ్యులు ఎవరూ తాకేందుకు ముందుకు రాలేదు. ఇదిలా ఉండగా వీధిలో మృతదేహం ఉండడం వల్ల స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఎవరు ముందుకు రావడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు.