న్యాయవాద దంపతులు వామన్రావు, నాగమణి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. పోలీసులు, ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హైకోర్టు ప్రత్యక్షంగా కల్పించుకుంటేనే న్యాయం జరుగుతుందన్నారు.
ఉరితీయాలి..
న్యాయవాదుల హత్యకు నిరసనగా పెద్దపల్లి జిల్లా మంథనిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. కాంగ్రెస్, భాజపా, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ కలిసి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రయాణ ప్రాంగణం ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. దోషులను ఉరితీయాలని డిమాండ్ చేశారు.
రామగిరి ఎస్సైని వెంటనే సస్పెండ్ చేయాలని, ఎస్సైకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు తెరాస నేతలకు వంత పాడుతున్నారని ఆరోపించారు. హత్య జరిగి 24 గంటలు గడుస్తున్నా నిందితులను పట్టుకోవడంలో వైఫల్యమయ్యారని శ్రీధర్ బాబు అన్నారు.
హత్యపై కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ ఖండించకపోవడం బాధాకరం. గతంలో మంథని నియోజకవర్గంలో జరిగిన ఘటనలో దోషులను పట్టుకొని ఉంటే ఈ హత్య జరగేది కాదు. న్యాయవాదులను హత్య చేసిన నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టం. హత్యలో ఎంతటి వారున్నా వారిని హైకోర్టు వదిలి పెట్టొద్దు.
-శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే
మంథని నియోజకవర్గంలో గుండాయిజం, రౌడీయిజం విచ్చలవిడిగా పెరుగుతోందని భూపాలపల్లి జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు దండు రమేష్ అన్నారు. ఎన్నోసార్లు ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తెరాస కండువా కప్పుకొని పని చేస్తున్నారని ఆరోపించారు.
ఈ కేసులో తగిన న్యాయం జరగాలంటే హైకోర్టు జస్టిస్ ప్రత్యక్షంగా కల్పించుకోవాలని న్యాయవాది రఘోత్తమరెడ్డి డిమాండ్ చేశారు. ధర్నాలో మంథని బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'వామన్రావు దంపతుల హత్య కేసును సీఐడీకి ఇవ్వండి'