Floods in Manthani: గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దపల్లి జిల్లా మంథని వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గోదావరి వరద పోటెత్తడంతో గౌతమేశ్వరస్వామి ఆలయం చుట్టూ భారీ స్థాయిలో ప్రవహిస్తోంది. శ్రీ గౌతమేశ్వర స్వామి దేవాలయంలో 20 మంది అక్కడే చిక్కుకున్నారు. అనేక సంవత్సరాలుగా పూజలు నిర్వహిస్తూ అర్చకులు, సహాయకులు అక్కడే నివాసముంటున్నారు.
ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు ఎటువంటి ప్రమాదం జరగలేదు. కానీ ఈ ఏడాది భారీగా వరదలు ఆలయాన్ని చుట్టుముట్టడంతో విద్యుత్, రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. గత రెండు రోజులుగా వరద నీరు అంతకంతకు అమాంతంగా పెరుగుతుండడంతో భయభ్రాంతులకు గురవుతున్నామని తెలిపారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వేడుకుంటున్నారు.
అర్ధరాత్రి ఎమ్మెల్యే పరామర్శ: మంథని మండలంలోని నీట మునిగిన గ్రామాల ప్రజల పునరావాస కేంద్రాలను మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పరిశీలించారు. అర్ధరాత్రి 2 గంటల వరకు మంథని మండలంలోని సూరయ్య పల్లి, పోతారం, బెస్తపల్లి, సిరిపురం, విలోచవరం గ్రామాల్లో ఇళ్లు నీట మునిగిన ప్రజలను కలిసి వారికి ధైర్యం చెప్పారు. గ్రామ ప్రజలకు నాగారం రైతు వేదిక, చిల్లపల్లి, బెస్తపల్లిలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లి వారి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. మంథని సీఐ, ఎమ్మార్వోతో ఫోన్లో మాట్లాడిన శ్రీధర్ బాబు పునరావాస కేంద్రాలలో ఉన్నవారికి అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని.. అధికారులను రిస్క్ టీమ్‌ను అందుబాటులో ఉంచుకోవాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు.
జలదిగ్భంధంలో మంథని: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మంథని పట్టణం జలదిగ్బంధమైంది. పట్టణంలోని బొక్కల వాగు నీటి ప్రవాహానికి సమీప ప్రాంతాలైన లైన్ గడ్డ, వాగు గడ్డ, మర్రివాడ, అంబేద్కర్ నగర్, బోయిన్ పేట, దొంతుల వాడ, సూరయ్యపల్లి ఎస్సీ కాలనీ నీటిలో మునిగిపోయాయి. 1972 తర్వాత మళ్లీ మంథని పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుందని ప్రజలు అంటున్నారు. గోదావరికి వరద పోటెత్తడంతో నీరు భారీగా రావడంతో మంథని మండలంలోని ఖానాపూర్ గ్రామాన్ని రెవెన్యూ అధికారులు అర్ధరాత్రి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బెస్తపల్లి, ఎక్లాస్ పూర్, ఖాన్ సాయిపేటతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాలు వరద నీటి ప్రవాహంతో ముప్పు ఉండడంతో అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు.
నీటి మునిగిన మాతా-శిశు ఆస్పత్రి: ఇటీవల మంథని శివారులో నూతనంగా ప్రారంభించిన మాతాశిశు ఆస్పత్రి పూర్తిస్థాయిలో నీటమునిగింది. మంథని-కాటారం ప్రధాన రహదారి బంద్ కావడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పట్టణం చుట్టూ వరద నీరు పోటెత్తడంతో వ్యాపారస్తులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరికొన్ని వ్యాపార సముదాయాలు నీటిలో మునిగిపోయి నష్టం వాటిల్లింది. వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం నీటమునిగింది. వర్షపు నీటితో మంథని పోలీస్ స్టేషన్ జలమయం కాగా.. ఇళ్లలోకి పూర్తిగా నీరు చేరడంతో ఇళ్లపైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
ఇవీ చదవండి: