Young Man Commits Suicide Love Marriage Failed: వారు ఇరువురు డిగ్రీ నుంచి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక.. ఏమైనా ఫర్వాలేదు అని భావించి చివరికి ప్రేమ వివాహం చేసుకున్నారు. అటు ఎంతో ప్రాణంగా ప్రేయసిని విడిచిపెట్టి ఉండలేక.. ఇటు తల్లిదండ్రులకు ఏమీ జరగకుండా ఉండేందుకు వివాహం చేసుకుని.. వెంటనే న్యాయం కోసం తిన్నగా పోలీస్ స్టేషన్కు వధువు,వరుడు వెళ్లారు. తీరా చూస్తే ఆ పోలీస్ స్టేషన్లోనే తనకు న్యాయం జరగలేదని భావించి.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండలం జనగామ గ్రామంలో జరిగింది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామంలో నివసించే వరప్రసాద్, పూజలు ఇద్దరూ డిగ్రీ వరకు ఒకే కాలేజీలో చదువుకున్నారు. అప్పుడే వారిరువురు ప్రేమలో పడ్డారని చెప్పారు. అప్పటి నుంచి ఇద్దరూ ఒకే మాటపై ఉంటూ.. తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకుని వెళ్లాలని భావించుకున్నారని తెలిపారు. అయితే వారి ఇంట్లో తమ ప్రేమను ఒప్పుకోరని భయపడి.. పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఆ తరుణంలోనే గత నెల 24వ తేదీన ఇద్దరూ ఒక్కటై.. పెళ్లి చేసుకున్నారు. వరప్రసాద్ తమ కుటుంబానికి యువతి కుటుంబం నుంచి వేధింపులు వస్తాయని.. అలాగే తమకు రక్షణ కావాలని.. వివాహం అయిన వెంటనే స్థానికంగా ఉన్న బీబీపేట పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడ వరప్రసాద్, పూజలను ఎస్సై సాయి కుమార్ సముదాయించారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇంతలో అక్కడకు చేరుకున్న యువతి కుటుంబసభ్యులు ఎస్సైను ప్రలోభపెట్టి.. యువకుడికి వ్యతిరేకంగా మాట్లాడించారని యువకుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
వెంటనే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి.. ఇంటికి పంపించేశారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ బాధను దిగమింగలేక.. తమను అన్యాయంగా విడదీశారనే మనస్తాపంతో వరప్రసాద్ అదే రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని వారు తెలిపారు. వెంటనే కుటుంబసభ్యులు అతనిని కామారెడ్డి ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. శనివారం తుదిశ్వాసం విడిచాడు. తను మరణించడంతో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వరప్రసాద్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని అతని కుటుంబ సభ్యులు, జనగామ గ్రామస్తులు డిమాండ్ చేశారు. వారు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తన మృతికి ఎస్సై యువతి కుటుంబ సభ్యులు చెప్పినట్లు చేయడమేనని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
ఇవీ చదవండి: