గ్రామపంచాయతీ కార్యదర్శిని బదిలీ చేయడంపై.. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సౌజన్యను ఆకస్మికంగా బదిలీ చేయడంపై నిరసన వ్యక్తం చేశారు.
అవినీతిని అరికట్టి గ్రామాభివృద్ధిని ఆమె పరుగులు పెట్టిస్తుందని కితాబు ఇచ్చారు. స్వచ్ఛందంగా అవినీతికి వ్యతిరేకంగా పని చేయడంతో కొందరు ఉన్నతాధికారులు కక్షగట్టి బదిలీ వేటు వేశారని ప్రజలు ఆరోపణలు చేశారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఎదుట గ్రామస్థులు బైఠాయించి నిరసనలు తెలిపారు.
ఎంపీడీవో రాములు నాయక్, ఎంపీపీ రమేష్ నాయక్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే బదిలీ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారి బదిలీకి తమకు వ్యక్తి గత కక్షలు లేవని, ఉన్నతాధికారుల సమక్షంలోనే బదిలీ జరిగినట్లు ఎంపీడీవో వివరణ ఇచ్చారు. వారి వినతిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు
ఇదీ చదవండి: విజయ్ చిత్రంలో నటించట్లేదు: విద్యుత్