నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని తన స్వగృహంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. బాధితుల సహాయార్థం వేల్పూర్ పీహెచ్సీలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని అన్నారు. ఆంధ్ర పాలకులు తెలంగాణకు అన్యాయం చేసిన కాలంలో చంద్రబాబు, వైఎస్లతో పోరాడి కేసీఆర్ పార్టీని స్థాపించారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ ముందుకు సాగారని అన్నారు. తన తండ్రి సురేందర్ సీఎం కేసీఆర్తో కలిసి రాష్ట్ర సాధన కోసం పాటు పడ్డారని గుర్తుచేశారు.
ప్రజలను పోరాటం వైపు తీసుకెళ్లి రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర వహించారన్నారు. పేదలకు, వితంతువులకు, వికలాంగులకు, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చి ఆదుకుంటున్నామన్నారు. తెలంగాణను సశ్యశ్యామలం చేసేందుకు కట్టిన కాళేశ్వరం దేశానికే దిక్సుచిగా నిలిచిందన్నారు. పేదలకు, వితంతువులకు, వికలాంగులకు, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చిన తెరాస ప్రభుత్వమని వెల్లడించారు.