నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్, ఆయన సోదరుడు సోహెల్, సహా మరో ఏడుగురిపై కేసు నమోదైంది. మంగళవారం అర్ధరాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఇసుక రవాణా చేస్తున్నందుకు ఎమ్మెల్యేకు మామూలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్థానికులు కృష్ణ, ఆయన కొడుకు మధు, మాజీ కౌన్సిలర్ గౌస్ తనపై దాడికి దిగారని ధర్మవరపు వేణుగోపాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
కృష్ణ ఇచ్చిన సమాచారంతో ఎమ్మెల్యే, ఆయన సోదరుడు సోహెల్, ఎమ్మెల్యే పీఏ, గన్ మెన్, మరో ఇద్దరు సంఘటన స్థలానికి వచ్చారని వివరించారు. తనను రక్షించేందుకు వచ్చిన రహీం, ఫిరోజ్‌పై కూడా దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే షకీల్, మరో ఎనిమిది మందిపై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ రాకేష్ తెలిపారు.
ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేశారని ఫిర్యాదు చేసిన ముగ్గురు వ్యక్తులపై కూడా బోధన్ ఠాణాలో కేసు నమోదైంది. వేణుగోపాల్, రహీం, ఫిరోజ్ తమ ఇంటి ఎదుట నిలిపి ఉంచిన కారులో నుంచి రెండు లక్షలు రూపాయలు, తన మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కెళ్లారని కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులకు బుధవారం ఫిర్యాదు అందింది.
ఇదీ చూడండి : 'తెలంగాణలో ఎందుకు పుట్టానురా అనిపిస్తోంది'