నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనందిలో తర్ర గంగాధర్ బలవన్మరణం ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల వేధింపులే కారణమంటూ మృతుడి భార్యతో పాటు బంధువులు ఆరోపిస్తున్నారు. గ్రామస్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని కిందకు దించకుండా అడ్డుకొన్నారు. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా బాధిత కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. మృతదేహం ఇంకా చెట్టుకు వేలాడుతూనే ఉంది. నిందితులను అరెస్టు చేసే వరకు శవాన్ని కిందకు దించమని చెబుతున్నారు.
వివాదం...
న్యావనందిలో రెండు నెలల కిందట పుర్రె మమత హత్యకు గురైంది. కేసు దర్యాప్తులో భాగంగా గంగాధర్‌ను పోలీసులు ఇటీవల విచారించారు. నార్కో అనాలసిస్ పరీక్షలకు అంగీకరించి ఐదుగురు వ్యక్తుల్లో ఈయన ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంతలో గంగాధర్ ఆత్మహత్య చేసుకోవటం వివాదంగా మారింది.
వేధింపుల వల్లే...
భార్య మల్లవ్వ వేల్పూరు మండలం మోతెలోని పుట్టింటికి వెళ్లారు. ఇంటి వెనకాల ఉన్న చింత చెట్టుకు గంగాధర్ ఉరేసుకొని వేలాడటాన్ని చిన్న కుమారుడు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు చూసి ఇరుగుపొరుగు వారిని పిలిచారు. సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. దర్యాప్తు పేరుతో పోలీసులు వేధించడం వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకొన్నట్లు మల్లవ్వ ఆరోపించారు.
పోలీసుల చర్చలు...
మృతదేహాన్ని కిందికి దించి శవపరీక్షకు పంపేందుకు పోలీసులు ప్రయత్నించినా బాధిత కుటుంబం ఒప్పుకోలేదు. న్యాయం చేసే వరకు మృతదేహాన్ని కదలనివ్వమని బైఠాయించారు. పోలీసులు బాధిత కుటుంబం, వారి బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలతోనూ పలుదఫాలు చర్చించారు. అయినా చర్చలు సఫలం కాలేదు.
ఇదీ చూడండి: ఆకతాయిల ఆగడాలు.. వెకిలిమాటలతో యువతులకు వేధింపులు