Telangana University Incharge VC Vakati Aruna : తెలంగాణ వర్సిటీకి వైస్ ఛాన్సలర్ లేక 26 రోజులు గడుస్తుంది. ఈ మేరకు విశ్వవిద్యాలయానికి ఇంఛార్జీ వీసీగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైవు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్ గుప్తా చంచల్ గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు.
TU VC Ravinder Gupta Released : తెలంగాణ వర్సిటీ ఉపకులపతి డీ. రవీందర్ గుప్తా గత నెల 17వ తేదీన అవినీతి నిరోధక శాఖ వలలో పడిన విషయం తెలిసిందే. తార్నాకలోని తన నివాసంలో రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం దాసరి శంకర్ అనే వ్యక్తి దగ్గరి నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుబడినట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తుకు బాట వేయాల్సిన విశ్వవిద్యాలయం గత కొంతకాలంగా.. గొడవలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. దాదాపు నెల రోజులుగా వీసీ లేకుండా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విద్యార్థుల గురించి ఆలోచించాల్సిన వీసీ వారి పేరిట లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది బయటకు వచ్చిన విషయం.. ఇక వర్సిటీలో ఉపకులపతి రవీందర్ గుప్తా చేసిన అరాచకాలు వెలుగులోకి రానివి ఇంకెన్నున్నాయో.
తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రతిసారి ఏదో ఒక వివాదం రాజుకుంటూనే ఉంది. వాటికి సంబంధించి పాలక మండలి సభ్యులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వరుసగా సమావేశాలు నిర్వహించి సమస్యలపై చర్చించారు. ఇందులో క్రమంగా వీసీ అధికారాలకు కత్తెర వేసుకుంటూ తీర్మానాలు చేసుకుంటూ వచ్చారు. మొదట రిజిస్ట్రార్‌ను తొలగించారు. ఆ తరువాత వర్సిటీ ఆర్థిక అంశాలకు సంబంధించి వీసీని దూరం చేశారు. కనీసం వ్యక్తిగత మెయింటెనెన్స్‌కు డబ్బులు రాకుండా పాలకమండలి నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే విచారణకు సంబంధించి విజిలెన్స్, ఏసీబీకి లేఖ రాసింది.
వీసీ అరెస్ట్‌తో విశ్వవిద్యాలయం భవిష్యత్తు గురించి యోచన చేసి చివరకు వర్సిటీని చక్కదిద్దే బాధ్యతను ప్రభుత్వానికి అప్పగిస్తూ పాలకమండలి తీర్మానం చేసింది. ఈ క్రమంలోనే విజిలెన్స్ అధికారులు వర్సిటీలో పలుమార్లు తనిఖీలు చేపట్టారు. డబ్బులు ఇచ్చామంటూ వర్సిటీకి వచ్చిన చాలా మందిని అధికారులు విచారించారు. అలాగే విశ్వవిద్యాలయ ఖాతాల లావాదేవీలను పరిశీలించారు. గతంలో వర్సిటీలో పనిచేసిన రిజిస్ట్రార్లను విచారించారు. వీటన్నింటిని పరిశీలించి పూర్తి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు ఇచ్చారు.
ఇవీ చదవండి: