ఉత్తర తెలంగాణకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టును వర ప్రదాయనిగా పేర్కొంటారు. మహారాష్ట్రలో గోదావరి బాబ్లీ సహా నిర్మించిన అనేక ప్రాజెక్టులతో ఎస్సారెస్పీలోకి గోదావరి నీళ్లు రావడం గగనంగా మారిపోయింది. భారీ వర్షాలు కురిస్తే తప్ప ప్రాజెక్టు నిండే పరిస్థితులు లేకుండా పోయింది. గోదావరి దిగువన కాళేశ్వరం వద్ద నిర్మించిన ప్రాజెక్టు నుంచి ఎస్సారెస్పీకి నీటిని తరలించి పూర్వ వైభవం తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే వరద కాలువ ద్వారా నీటిని ఎత్తిపోసేలా పనులు చేపట్టారు. ఎస్సారెస్పీలో ప్రవాహం ఎక్కువైతే ఆ నీటిని దిగువకు వదిలేందుకు వరద కాలువ నిర్మించారు. అయితే అదే కాలువ శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇప్పుడు ఆయువు పోస్తోంది.
తుదిదశకు పనులు
కాళేశ్వరం ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టును స్థిరీకరించేందుకు పునరుజ్జీవన పథకం చేపట్టారు. రూ.1,170కోట్ల వ్యయంతో మూడు ఎత్తిపోతలతో రివర్స్ పంపింగ్ ద్వారా ప్రాజెక్టులోకి నీరు తరలించేలా ప్రణాళిక తయారు చేశారు. దాదాపు 140కి.మీ.లకుపైగా నీటిని వరద కాలువ ద్వారా ప్రాజెక్టులోకి పంపనున్నారు. 2017 ఆగస్టు 10న సీఎం కేసీఆర్ ఈ పథకానికి శంకుస్థాపన చేయగా పనులు తుదిదశకు చేరుకున్నాయి.
జగిత్యాల జిల్లా రాంపూర్, రాజేశ్వరరావుపేట వద్ద పంపుహౌస్ ల నిర్మాణం పూర్తి కాగా.. గతేడాది నుంచే ఈ పంపుహౌస్‌లు నీటిని ఎత్తి పోస్తున్నాయి. వరద కాలువకు ఈ పంపుహౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోశారు. తాజాగా మరోసారి సీఎం కేసీఆర్ ఆదేశాలతో పంపు హౌస్‌ల నుంచి వరద కాలువలోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. వీటిని చెరువుల ద్వారా పంటలకు మళ్లించుకుని రైతులు సాగు పనులు చేపట్టనున్నారు.
ఆ పంపుహౌస్ మిగిలింది..
పునరుజ్జీవన పథకం కింద మూడు పంపు హౌస్‌ల్లో రాంపూర్, రాజేశ్వరరావు పేట పూర్తి కాగా.. ప్రాజెక్టు జీరో పాయింట్ వద్ద నిర్మిస్తున్న ముప్కాల్ పంపు హౌస్ పనులు ఇంకా పూర్తి కాలేదు. సివిల్ పనులు 99శాతం పూర్తయ్యాయి. అయితే పంపు హౌస్‌లో 8 మోటార్లు బిగించాల్సి ఉండగా.. 3 మోటార్ల బిగింపు పూర్తి అయ్యింది.
మరో ఐదు పంపులు బిగించేందుకు ఆగస్టు 15వరకు లక్ష్యంగా పెట్టుకున్నారు. లాక్ డౌన్ కారణంగా మెటీరియల్ లేకపోవడంతో పనులు ఆలస్యమయ్యాయి. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయనున్నారు. అయితే పనులు పూర్తి చేసి తొందరగా నీటిని ఎస్సారెస్పీకి ఎత్తిపోస్తే.. పంటలకు నీళ్లు అందుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మళ్లీ పూర్వవైభవం
ముప్కాల్ పంపు హౌస్ పనులు పూర్తయితే... పునరుజ్జీవన పథకం పూర్తి కానుంది. కాళేశ్వరం నుంచే 60టీఎంసీల నీటిని ఎస్సారెస్పీలోకి ఎత్తిపోయనున్నారు. ఎస్సారెస్పీ నిరంతరం నీళ్లతో నిండు కుండను తలపించనుంది. మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి : ఓఆర్ఆర్పై మంత్రి వాహనం బోల్తా.. ఒకరు దుర్మరణం