తెలంగాణ వరప్రదాయినిగా పేరుగాంచిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ముందు ఆ గ్రామాలు వేర్వేరుగా ఉండేవి. 1975-80 మధ్య కాలంలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడడంతో గోదావరి పరీవాహక ప్రాంతంలోని నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో చాలా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అలాంటి గ్రామాలకు ప్రభుత్వం స్థలాలున్న చోట ప్లాట్లు, భూములు కేటాయించడంతో అప్పటి వరకు ముంపు ప్రాంతంలో దూరంగా ఉన్న గ్రామాలు జంట గ్రామాలుగా ఏర్పడ్డాయి. అలాంటి వాటి గురించి ఇప్పుడు తెలుసుకొందాం.
కలిసిపోయిన వెల్మల్-బొప్పారం: నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని వెల్మల్-బొప్పారం జంట గ్రామాలు ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిర్మాణానికి ముందు ప్రస్తుతం నిండుగా కనిపించే ప్రాజెక్టు నీటిలోనే ఉండేవి. ఈ రెండు గ్రామాల మధ్య దాదాపు 10 కి.మీ.లకు పైగానే దూరం ఉండేదని గ్రామస్థులు చెబుతారు. ప్రాజెక్టు మొత్తం ఖాళీ అయితే తప్ప పాత ఊళ్ల ఆనవాళ్లు కనిపించవు. ముంపునకు గురి కాగానే ఈ రెండు గ్రామాలకు సోన్ మండలంలో స్థలాలు కేటాయించడంతో జంట గ్రామాలుగా ఏర్పడ్డాయి. జనాభా పరంగా చూస్తే బొప్పారంలో 2,340, వెల్మల్‌లో 2,850 మంది ఉండడంతో రెండూ వేర్వేరు పంచాయతీలుగానే ఉన్నా ఒకే దగ్గర ఉండడంతో కొత్త వారెవరూ ఏది ఏ ఊరో తెలుసుకోవడం చాలా కష్టం.
* బాసర మండలంలోని సాలాపూర్-సావర్గాం గ్రామాలు సైతం పునరావాసంలో భాగంగా జంటగా ఏర్పడినవే. వీటితో పాటు నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని అన్నారం-సిర్పూర్, నడ్కుడ-గాదేపల్లి, వన్నెల్(కే)-సిద్దాపూర్, ఉమ్మెడ-మాయాపూర్ గ్రామాలు కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ఏకమై జంట గ్రామాలుగా ఏర్పడ్డవే..
రహదారికిరువైపులా ఏర్పడిన అర్లి-గొడిసెర గ్రామాలు (ఎడమవైపు అర్లి, కుడిపక్క గొడిసెర గ్రామం) పది కి.మీ. దూరం పది అడుగులకు తగ్గింది: ప్రస్తుతం లోకేశ్వరం మండలంలోని గొడిసెర పంచాయతీ పరిధిలోని గొడిసెర-అర్లి జంట గ్రామాలు పోచంపాడ్ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురయ్యాయి. ముందు అర్లి గ్రామం సుద్దవాగును ఆనుకుని ఉండగా గొడిసెర పంచగుడి సమీపంలో ఉండేది. ఈ రెండు గ్రామాల మధ్య దాదాపు పది కి.మీ. దూరం ఉండేది. పునరావాసంగా రాయపూర్‌కాండ్లి(ప్రస్తుత)కి సమీపంలో స్థలం కేటాయించడంతో 1980లో జంట గ్రామాలుగా ఏర్పడ్డాయి. పంచాయతీల విభజనకు పూర్వం రెండు గ్రామాలు జోహార్‌పూర్ పంచాయతీలో ఉండగా ఇప్పడు గొడిసెర పంచాయతీగా ఏర్పడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం గొడిసెరలో 669 మంది జనాభా ఉండగా అర్లిలో 525 మంది ఉన్నారు. ఈ రెండు గ్రామాల మధ్య నుంచి వెళ్లే రహదారి మాత్రమే వీటిని విభజిస్తుంది.
హన్మాన్ ఆలయం వైపు ఎడ్దూర్, పంచాయతీ కార్యాలయం వైపు పొట్‌పెల్లి(బి) గ్రామాల మధ్య రహదారి విడిగా ఉన్న ఊళ్లను సుద్దవాగు కలిపింది: లోకేశ్వరం మండలంలోని ఎడ్దూర్, పొట్‌పెల్లి(బి) గ్రామాలు గతంలో సుద్దవాగును ఆనుకుని వేర్వేరుగా ఉండేవి. గోదావరి నదిపై ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిర్మించగా సుద్దవాగు ద్వారా వెనకతట్టు నీరు గ్రామాలకు చేరడంతో రెండు గ్రామాలకు 3 కి.మీ.దూరంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇలా గతంలో వేరుగా ఉన్న రెండూళ్లు ఇప్పుడు ఒక్కటయ్యాయి. గ్రామంలోకి ప్రవేశించగానే ఎడమవైపు పొట్‌పెల్లి, కుడివైపు ఎడ్దూర్ గ్రామాలుంటాయి. 529 మంది జనాభా గల ఎడ్దూర్, 654 మంది ఉన్న పొట్‌పెల్లి(బి) గ్రామాలను ఒక్కటిగా చేసి పొట్‌పెల్లి(బి)పేరున పంచాయతీ ఏర్పడింది.
ఇవీ చదవండి: