Road Accidents Today in Telangana: నిజామాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 38 మందితో కర్ణాటకలోని రాయచూర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఆర్మూర్ మండలం పెర్కిట్ వద్ద రాజధాని ట్రావెల్స్‌కు చెందిన ఓ ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఏడుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ నిద్ర మత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
Hanamkonda Accident Today: హనుమకొండ ఎన్ఐటీ సమీపంలో ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి పంపించారు. మృతుడు కాజీపేట బాపూజీ నగర్‌కు చెందిన విద్యార్థి భరద్వాజగా గుర్తించారు. దట్టమైన పొగ మంచు కురవడంతో ఎదురుగా ఉన్న వాహనాలు గుర్తించక ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు.
భూపాలపల్లి-వరంగల్ ప్రధాన రహదారిపై ఉదయం దట్టమైన పొగ మంచు కురవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లైట్లు వేసుకొని ప్రయాణం సాగించారు. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోవడం, పొగ మంచు దట్టంగా కురుస్తుండటంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప.. పొగ మంచులో బయటకు వచ్చి అనారోగ్యాల బారిన పడొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఉదయం వాకింగ్‌కు దూరంగా ఉండాలని తెలిపారు.
టైరు పేలి పల్టీలు కొట్టిన కారు..: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద టైరు పేలి ఓ కారు పల్టీలు కొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్‌లో సమీప ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి..
కార్లకు బ్లాక్ ఫిల్మ్ ఉంటే ఫైన్.. ట్రాఫిక్ పోలీసుల వార్నింగ్