నిజామాబాద్ జిల్లా బోధన్‌లో మిల్లుల నిర్వాహకులు రైస్ మిల్లర్ల యజమానుల సంఘం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. రా రైస్ మిలర్లను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 9 లక్షల 25 వేల టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారని, కానీ తాము ఎంత కొనాలో ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదని అన్నారు. దీని వల్ల లారీలు వచ్చి రైస్ మిల్లుల వద్ద గంటల కొద్దీ వేచి ఉంటున్నాయని పేర్కొన్నారు.
ఖరీఫ్ సీజన్ వరి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వాధికారుల సూచనలు ఇబ్బందికరంగా మారాయని నిర్వాహకులు వెల్లడించారు. 75 శాతం ధాన్యం రా రైస్ మిల్లులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కొనుగోలు కేంద్రాల నుంచి పంపిన వడ్లు వెంటనే ఖాళీ చేయాలని అధికారులు అదేశిస్తున్నారు. కానీ వాటిని బియ్యంగా చేసి గోదాంలకు పంపితే అక్కడ లోడు దింపుకోకపోవడంతో రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా లారీల నిర్వహణ వ్యయం ఎక్కువవుతోందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రా రైస్ మిలర్లను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: నిమ్మ పంటకు ధరల తెగులు సోకింది... రైతుకు ఆర్థిక కష్టాల్ని మిగుల్చుతోంది