Gambling Games in Nizamabad hotels : ఇంతకు ముందు మారుమూల గ్రామాలు, ఫామ్‌హౌస్‌లు, అడవి ప్రాంతాలు వంటివి జూదానికి స్థావరాలుగా ఉండేవి. నగరాలు, పట్టణాల్లో గుట్టు చప్పుడు కాకుండా ఇళ్లలో జూదం నిర్వహించేవారు. కానీ కొన్ని రోజులుగా నిర్వాహకుల పంథా మారింది. ఏకంగా స్టార్ హోటళ్లనే ఇందుకు అడ్డాగా మార్చుకుంటున్నారు. మామూలు వ్యక్తుల్లా హోటళ్లలో రూమ్‌లు బుక్ చేస్తున్నారు. అనంతరం జూదం ఆడేవారికి సమాచారం ఇస్తున్నారు. నేరుగా రూమ్‌లోనే ఆట ఆడిస్తున్నారు.
నిత్యం లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇటీవల నిజామాబాద్ నగరంలో ఈ బండారం బయట పడింది. ఆర్గనైజింగ్ జూదం నడుస్తుందన్న పక్కా సమాచారంతో నగరంలోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. రెండు రూమ్‌ల్లో జూదం ఆడుతున్న 22 మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ గదిలో 9 మంది అరెస్ట్ చేసి రూ.4.5లక్షల నగదు, మూడు ద్విచక్రవాహనాలు, తొమ్మిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇదే హోటల్లో మరో గదిలో 13 మందిని అరెస్ట్ చేసి రూ.69 వేల నగదు, 13 సెల్ ఫోన్లు, 3 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
స్టార్ హోటళ్లే కేంద్రాలు: నిజామాబాద్ నగరంలో త్రీస్టార్ హోటళ్లు మూడు ఉన్నాయి. హైదరాబాద్ రోడ్డులో నిఖిల్‌సాయి, వంశీ ఇంటర్నేషనల్ హోటళ్లు ఉండగా.. బైపాస్ రోడ్డులో నూతనంగా లహరి ఇంటర్నేషనల్ హోటల్ వెలిసింది. వీటితో పాటు ఇతర హోటళ్లు, లాడ్జ్‌లు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఇవే జూదానికి అడ్డాగా మారాయి. ఆన్‌లైన్ లేదా నేరుగా రూములను బుక్ చెయ్యడం.. జూదం ఆడేవారిని ఏర్పాట్లు చెయ్యడం, ఆటగాళ్లను రప్పించి జూదం ఆడించడం.. ఇదే నిర్వాహకులు చేస్తున్నది.
హోటళ్ల నిర్వాహకులు బస కోసమని అనుకుని వివరాలు తీసుకుని రూమ్‌లు ఇస్తున్నా.. లోపల జరుగుతున్నది మాత్రం వేరు. ఒకప్పుడు జూదం అంటే ఊరు బయట ఓ డెన్‌లో ఆడుకునే వాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓ వైపు ప్రభుత్వం క్లబ్బులను బ్యాన్ చేసి ఉక్కుపాదం మోపితే.. జూదరులు మాత్రం తమకు స్థానికంగా ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని ఇష్టారాజ్యంగా ఆట సాగిస్తున్నారు. ఊరు బయట నుంచి నేరుగా స్టార్ హోటళ్లను అడ్డగా మార్చేశారు. ఆటకు ఇంత అని చెబుతూ దందాను నడుపుతున్నారు.
Police raids on poker camps : జూదరులకు జల్సా చేసుకునేందుకు మద్యం, బిర్యానీతో పాటు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ ఆకర్షిస్తున్నారు. పోలీసులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో జూదం జోరుగా నడుస్తోంది. గతంలోనూ హైదరాబాద్ రోడ్డులో ఉన్న హోటళ్లలో జూదం ఆడేవారు పట్టుపడ్డా కఠిన చర్యలు లేకపోవడంతో షరామూమూలే అవుతోంది. ఇప్పుడైనా పోలీసులు గట్టి చర్యలు చేపడతారో లేదో వేచి చూడాల్సిందే.
ఇవీ చదవండి: