మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న తనిఖీ కేంద్రాలకు త్వరలోనే తాళం పడే అవకాశం ఉంది. పంట ఉత్పత్తులపై విధించే ఒక శాతం పన్ను(సెస్సు)తోనే మార్కెట్ కమిటీలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. పన్ను వసూళ్ల కోసం తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టనున్న 'వన్ ఇండియా వన్ మార్కెట్' అమల్లోకి వస్తే పన్ను రద్దు చేయాల్సి ఉంటుంది.
ఇందులో భాగంగా వారం రోజుల కిందట రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వివరాలు సేకరించారు. తనిఖీ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? అందులో ఎంత మంది పనిచేస్తున్నారు? ఆదాయం సమకూర్చుకొనేందుకు చేపట్టాల్సిన మార్గాలు తదితర వివరాలు ఆరా తీశారు.
వన్ ఇండియా- వన్ మార్కెట్ విధానం అమలుపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. చర్చలు కొనసాగుతున్నాయి. ఈ విధానం అమలైతే మార్కెట్ కమిటీల ఆదాయానికి భారీగా గండిపడనుంది. ఆదాయం పెంచుకొనే మార్గాలు అన్వేషించాల్సి ఉంటుంది.
-రియాజ్, మార్కెటింగ్ శాఖ అధికారి
17 కమిటీ.. రూ. 17 కోట్ల ఆదాయం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 17 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. సెస్సు రూపంలో ఏటా రూ.17 కోట్ల వరకు, ఇతర మార్గాల ద్వారా రూ.28 లక్షల వరకు ఆదాయం వస్తుంది. గతంలో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలోనే పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరిగేవి. ప్రస్తుతం ప్రభుత్వం ఊరూరా కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేపట్టడం వల్ల మార్కెట్ యార్డుల్లో సందడి కనిపించడం లేదు. సెస్సు రూపంలో వచ్చే ఆదాయంతోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన ‘ వన్ ఇండియా వన్ మార్కెట్ విధానం’ అమల్లోకి వస్తే మార్కెట్ కమిటీల ఆదాయానికి గండి పడనుంది. తమ పంట ఉత్పత్తులను రైతులు దేశంలో ఎక్కడైనా విక్రయించే వెసులు బాటు రానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్ కమిటీలు వసూలు చేస్తున్న ఒక శాతం పన్ను(సెస్సు)ను రద్దు చేయాల్సి ఉంటుంది.