ఆసుపత్రి పారిశుద్ధ్య,పేషెంట్ కేర్, సెక్యూరిటీ విభాగాల్లో పనిచేస్తున్న వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఇన్‌పేషెంట్లు, కొవిడ్ బాధితుల కోసం కొత్త భవనం ప్రారంభించడం వల్ల కార్మికులకు పని భారం పెరిగిందని కావున కార్మికుల సంఖ్యను పెంచాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పి.సుధాకర్ కోరారు. సమాన పనికి-సమాన వేతనం చెల్లించాలన్నారు.
పెండింగ్‌లో ఉన్న 2 నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలని అదేవిధంగా లాక్‌డౌన్ సమయంలో విధులు నిర్వహించిన వారందరికీ 10 శాతం ఇన్సెంటివ్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కొవిడ్‌కాలంలో విధులు నిర్వహిస్తున్న వారికి రోజుకు 300 రూపాయలు అదనంగా చెల్లించాలన్నారు. సమస్యలతో కూడిన వినతి పత్రాలను ఆసుపత్రి సూపరింటెండెంట్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌కు అందజేశారు. ఈధర్నాలో యూనియన్ నాయకులు డి.భాగ్యలక్ష్మి, ఎస్.కవిత, లాలూ, నరేష్ తదితర కార్మికులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కొవిడ్, వైద్యశాఖలోని కీలక అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ