నిజామాబాద్ జిల్లా గ్రామీణ నియోజకవర్గంలో వరి పంట నేల వాలింది. ముందస్తుగా సాగుచేసిన దొడ్డు రకాలు నూర్పిడి చేయగా వారం రోజుల పాటు కమ్ముకున్న కారు మేఘాలు, చిటపట చినుకులతో ధాన్యం కల్లాల్లో తడిసి ముద్దయ్యాయి. ముఖ్యంగా గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతం లోని పంటలన్నీ నీట మునిగాయి. వరుణుడు శాంతించి భానుడు కనిపించడంతో రెక్కల్ని కూడగట్టుకొని ధాన్యం గింజ కాపాడేందుకు నానా తంటాలు పడుతున్నారు. నూర్పిడి చేసిన ధాన్యం రహదారులపై పోసి ఆరపెడుతున్నారు.
ఆదుకోండి..
కాగా నడుము లోతు నీటిలో మునిగిన వరి పంటలను కాపాడేందుకు ఇందల్వాయి మండలం అన్సన్ పల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు చెరువు వెనుక జలాల్లో మునిగిన వరి పంటను కాపాడుకోవడానికి కూలీల సాయంతో కంకులను కోత కోసి, పసుపు ఉడకబెట్టి కడాయిలో వేసి ఒడ్డుకు చేర్చుకున్నారు. ఇలా ఎకరానికి ఐదు వేల పైనే ఖర్చు అవుతుందని, పైగా నీళ్లలో కోత కోయడానికి కూలీలు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా పెట్టుబడులు పెట్టి నష్టపోతున్న తమను అధికారులు పట్టించుకోవడంలేదని వాపోయారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి: రైతుకు సాయం.. యువతకు ఆదాయం!