ఎస్సారెస్పీలో నీటి నిల్వ ఆశాజనకంగా ఉండడం వల్ల నిజామాబాద్ జిల్లాలోని గుత్ప, అలీసాగర్, మధ్య, చిన్న తరహా ఎత్తిపోతల పథకాలు పూర్తిస్థాయిలో నడిచే అవకాశం ఉంది. దీనితో సాధారణ సాగు కంటే ఎక్కువ ఎకరాల్లో సాగు చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు వ్యయసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. 2020 ఖరీఫ్‌పంటల ప్రణాళికను జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవింద్‌ప్రభుత్వానికి నివేదించారు.
జిల్లా ఎగువ ప్రాంతంలో భూగర్భ జలాలు ప్రస్తుతానికి కాస్త తగ్గినా.. ఆశించిన స్థాయిలోనే ఉన్నాయి. సాధారణ వర్షాలు పడినా సాగుకు ఎలాంటి డోకా ఉండదని వ్యవసాయశాఖ భావిస్తోంది. అందులో భాగంగానే ప్రధాన జలాశయాలు, చెరువులు, బోర్ల కింద వరి విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తోంది.
- జిల్లా సాధారణ సాగు 2.08 లక్షలు కాగా నిరుడు 2.53 లక్షల ఎకరాల్లో పండించారు.
- ఈసారి 3.60 లక్షలు వేస్తారని భావిస్తున్నారు. ఇదే జరిగితే రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తిలో జిల్లానే అగ్రగామిగా నిలుస్తుంది.
సోయా తగ్గి.. మక్క పెరిగి...
దశాబ్దం కిందట ఇందూరు జిల్లాలో లక్షల ఎకరాల్లో సాగైన సోయాబీన్‌పంట రానురాను కనుమరుగైంది. ప్రస్తుతం సాధారణ విస్తీర్ణం 1.16 లక్షల ఎకరాలుంటే అందులో 65 వేలకు మించి సాగు చేయకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు మక్క పంటకు పూర్వ వైభవం వస్తోంది. సాధారణ విస్తీర్ణం 46 వేల ఎకరాలుంటే ఈసారి 56,250 ఎకరాల్లో పండించే అవకాశం ఉంది.
అపరాలు అంతంతే...
జిల్లాలో పప్పుదినుసుల సాగు ఏటికేడు తగ్గుతోంది. కంది ఓ మోస్తరుగా వేస్తుండగా.. మినుము, పెసర కనుమరుగవుతున్నాయి. అపరాలన్నీ కలిపి ఆరు వేల ఎకరాల్లోనే వేయనున్నారు. పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉండడం, విత్తనాలు, సరైన మార్కెట్‌సౌకర్యం లేకపోవడం రైతును వెనుకడుగు వేసేలా చేస్తున్నాయి.
పసుపు మరింత పచ్చగా...
ఆశించిన ధర లేనప్పటికీ పసుపు సాగుపై రైతులు ఆశ చంపుకోవడం లేదు. మూడేళ్ల నుంచి ధరలు తగ్గుతూ వస్తున్నప్పటికీ ఈ ఏడాది మునుపటి కంటే ఎక్కువగా పండించేందుకు విత్తనాన్ని సమకూర్చుకున్నారు. జిల్లా సాధారణ సాగు 33 వేల ఎకరాలు ఉంటే ఈ సారి 40 వేల ఎకరాలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
రాయితీపై వరి, సోయా, పచ్చిరొట్ట...
సాగుకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వరిలో ఎంటీయూ-1010, బీపీటీ-5204, కేఎన్‌ఎం-118, జేజీఎల్,047 రకాలను తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా రైతులకు రాయితీపై అందించే వీలుంది. ఇందుకు 30,100 క్వింటాళ్ల విత్తనాన్ని సిద్ధం చేసింది. సోయాబీన్‌లో జేఎస్‌రకం వంగడాన్ని 30 వేల క్వింటాళ్ల వరకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, జనుము విత్తనాలు కూడా సమకూర్చే పనిలో ఉంది.
సరిపడా ఎరువులు...
గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఎరువుల కొరత రాకుండా అధికార యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టింది. అవసరమైన నిల్వలకు సిద్ధమైంది. పెరుగుతున్న పంటల సాగుకు అనుగుణంగా యూరియా, డీఏపీ, కాంప్లెక్స్‌లు 1.60 లక్షల మెట్రిక్‌టన్నులు కావాలని అంచనా వేస్తోంది.
కొరత రానివ్వం...
ఖరీఫ్‌పంటలకు సంబంధించిన సాగు అంచనాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించాం. అవసరమైన ఎరువులు, విత్తనాలను సిద్ధంగా ఉంచుతున్నాం. రైతులకు ఎక్కడా కొరత రానివ్వం. ఏయే పంటలు వేయాలనే విషయమై క్షేత్రస్థాయిలో వివరిస్తున్నాం. నీటి వనరులను బట్టి పంటలేసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం.
- గోవింద్, జిల్లా వ్యవసాయాధికారి