నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవిందపేట్లో జరిగిన అమానవీయ ఘటన.. మరోసారి జిల్లాలో పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొవిడ్‌తో మరణించిన వారి అంత్యక్రియలను గౌరవప్రదమైన రీతిలో జరపాలన్నారు. జిల్లాలోని రెవెన్యూ, వైద్య, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కరోనాతో మరణించిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు సహకరించని పక్షంలో అధికారులే గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాలన్నారు. శవాన్ని పూర్తిగా కవర్ చేయాలని, అంత్యక్రియలు నిర్వహించడానికి నలుగురికి పీపీఈ కిట్లు సరఫరా చేయాలని వైద్యాధికారులకు సూచించారు. రెవిన్యూ డివిజన్లలో ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లలో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.
గ్రామాల్లో ఎవరైనా కొవిడ్‌తో మృతిచెందినట్లు తెలిసిన వెంటనే సంబంధిత రెవెన్యూ, మున్సిపల్ లేదా పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం అందుకున్న వెంటనే బంధువులతో సంప్రదించి పీపీఈ కిట్లు అందచేసి కుటుంబ సభ్యులతో లేదా ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన కమిటీ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించాలన్నారు.