నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏర్పాట్లను కలెక్టర్ నారాయణ రెడ్డి వివరించారు. ఈనెల 9న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుందని తెలిపారు. ఈ నెల 12న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. 6 టేబుళ్లు, 2 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుందని వివరించారు. 824 మంది ఓటర్లకు 50 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
మాస్కులు, గ్లౌజులు తప్పనిసరి...
బ్యాలెట్ పత్రాల ద్వారా నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరుగనుందని కలెక్టర్ అన్నారు. మాస్కులు, గ్లౌజులు ఉంటేనే పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. కరోనా బాధితులైన ఓటర్లకు చివరి గంటలో అవకాశం ఇస్తామని తెలిపారు. ఇందుకోసం పీపీఈ కిట్లు, అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తామని వివరించారు. కరోనా పాజిటివ్ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉందని పేర్కొన్నారు. గురువారం ఉదయం వరకు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుకు అవకాశం ఉందని తెలిపారు.
ఇదీ చదవండి: నవంబర్, డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు: పార్థసారథి