నిజామాబాద్‌లోని ఠాణా కలన్ చెరువు వద్ద ప్రతినెలా మట్టి స్నానాలు జరుగుతాయి. ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రజలు కూడా ఈ మట్టిస్నానంపై ఆసక్తి కనపరుస్తున్నారు. ఈ స్నానం చేయడానికి జిల్లాలోని 12 యోగా శిక్షణ కేంద్రాల నుంచి దాదాపు 200 మంది పాల్గొని.. మట్టి స్నానంపై అవగాహన కల్పిస్తున్నారు.
సర్వరోగ నివారణం.. మట్టే
సర్వరోగ నివారిణిగా మట్టి పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో వెల్లడించారు. కానీ ఇప్పుడు ఎటుచూసిన కాంక్రీట్ రోడ్లు.. పాలరాతి బండలు కనిపిస్తున్నాయి. మట్టినేలలే కరవయ్యాయి. కాళ్లకు చెప్పులు లేకుండా మట్టి నేలపై నడిస్తే నిర్ణీత శక్తి జనిస్తుంది. నరాలు ఉత్తేజమవుతాయి. నేలపై నడిచేటప్పుడు రక్తనాళాలతో పాటు కండరాల పనితీరు మెరుగవుతుంది. పెద్దా చిన్నా తేడా లేకుండా రోజుకో గంటపాటు మట్టిలో ఆడడం, నడవడం చేస్తే ఆసుపత్రులకు వెళ్లే బాధ తప్పుతుందంటున్నారు.
మట్టి తయారీ ఇలా...
పుట్ట మట్టితో పాటు కుప్పటి ఆకు, గోమూత్రం, గోవు పేడ, గానుగ ఆకు, వేపాకు రసం, తులసి ఆకు రసం, కలబంద గుజ్జు, చందనం, తేనె కలిపి మిశ్రమాన్ని తయారు చేస్తారు. ఇది ప్రకృతి సిద్ధంగా ఉండడంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మట్టిని శరీరానికి పెట్టుకున్న తరువాత సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. కొద్ది సేపటి తర్వాత స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఉపయోగాలు మెండు
మట్టి స్నానం చేయడం వల్ల 54 రకాల చర్మ వ్యాధులు దూరం అవుతాయని యోగా గురువులు చెబుతున్నారు. చర్మ సంబంద వ్యాధులతో పాటు చెడు కొలెస్ట్రాల్, వేడిని తగ్గించడం జరుగుతుందని.. ఉదర సంబంధ వ్యాధులు నయమవుతాయని అంటున్నారు. వీర్యకణాల సంఖ్య పెరగుతుందని, సంతానలేమి సమస్య దూరమవుతుందని అంటున్నారు. మట్టి పట్టి వేసుకోవడం వల్ల ఎముకల్లో మజ్జ పెరిగి మోకాళ్ల నొప్పులు తగ్గుతాయని చెబుతున్నారు. మట్టి స్నానంతో చర్మం మృదువుగా కాంతివంతంగా మారుతుందని.. స్వేద రంధ్రాలు తెరుచుకుంటాయని నిపుణులు తెలిపారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలోకి కరోనా రానివ్వం: కేసీఆర్