MP Arvind Comments: నిజామాబాద్ జిల్లా బోధన్ ఘటనలో అకారణంగా భాజపా కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని స్థానిక ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. నిజామాబాద్ పొలీస్ కమిషనర్ నాగరాజు శాంతి భద్రతలను కాపాడేందుకు కాకుండా... కేవలం సీఎం కేసీఆర్ ఆదేశాలను అమలు చేసేందుకు వచ్చారని అన్నారు. నగర శివారులో ఉన్న సారంగపూర్ జిల్లా జైలులో బోధన్ ఘటనలో రిమాండ్‌లో ఉన్న కార్యకర్తలు, నేతలను ఎంపీ అర్వింద్ పరామర్శించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెరాస అనవసర రాద్ధాంతం చేస్తోందని... రా రైస్ ఎంతిచ్చినా కొనేందుకు కేంద్రం సిద్ధమని చెప్పారు. యాదాద్రి ప్రారంభానికి ప్రధానిని పిలిచే విషయంలో రాజకీయాలు సరికాదన్నారు. ప్రజలే మోదీని ఆహ్వానిస్తారని చెప్పారు. యాదాద్రికి రూపకల్పన చేసిన చినజీయర్ స్వామిని పిలవకపోవడం సరైంది కాదన్నారు. కేటీఆర్ సీఎం కాకుండా ఆ పార్టీ నేతలే త్రిముఖ వ్యూహం పన్నారని ఎద్దేవా చేశారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి కొడుకును సీఎం చెయ్యాలని భావించిన కేసీఆర్‌కు ఐదు రాష్ట్రాల ఎన్నికలతో అయోమయంలో పడ్డారన్నారు. వడ్లను కొనాల్సిన రాష్ట్ర ప్రభుత్వం భాజపా కార్పొరేటర్‌లను కొనడం ఏంటని ప్రశ్నించారు.
'ముఖ్యమంత్రి బిడ్డ వడ్లు కొనదట! కానీ... భాజపా కార్పొరేటర్లను కొంటదట. యాదాద్రి ప్రారంభానికి ప్రధానిని పిలిచే విషయంలో రాజకీయాలు సరికాదు. ప్రజలే మోదీని పిలుస్తారు.'
-- ధర్మపురి అర్వింద్, ఎంపీ
ఇదీ చూడండి: బోధన్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ... అదుపు చేసిన పోలీసులు