కేటీఆర్‌కు సీఎం పదవి విషయాన్ని నిజామాబాద్ ఎమ్మెల్యేలు మరోసారి ప్రస్తావించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బోధన్ ఎమ్మెల్యే షకీల్‌లు కేటీఆర్ సీఎం కావాలని ఆకాక్షించారు. సీఎం పదవికి కేటీఆర్ సమర్థుడని అభిప్రాయపడ్డారు. కేటీఆర్ సీఎం కావాలని కోరుకునే వారిలో తానూ ఒకడినని.. ఆయన సీఎం అయితే రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరుగుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఆలోచించి కేటీఆర్‌ను సీఎం చేయాలని కోరారు. డిచ్పల్లి మండలం నడ్పల్లిలో రైతు వేదిక ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
వచ్చే అసెంబ్లీ సమావేశాలు కేటీఆర్ అధ్యక్షతన జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు బోధన్ ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. కేటీఆర్‌ను సీఎం చేయాలని.. తనతో పాటు యువ ఎమ్మెల్యేలు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారని చెప్పారు. బోధన్‌లో ఆయనను మంగళవారం పలు సంఘాల నేతలు సన్మానించిన సందర్భంగా షకీల్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ షకీల్ కేటీఆర్ సీఎం కావాలన్న విషయాన్ని ప్రస్తావించారు.
ఇదీ చదవండి: 'హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకుసాగుతోంది'