రైతులను ఉగ్రవాదులతో పోలిస్తే బండి సంజయ్ ఎక్కడా తిరగలేరని ఆర్మూరు ఎమ్మెల్యే, తెరాస నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌పై భాజపా నేతల భాష మార్చుకోకపోతే.. తెరాస సైన్యం ఊరుకోదని హెచ్చరించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో గంజాయి.. బండి సంజయ్‌కి రాజకీయ జీవితం ఉండవన్నారు. ఆర్మూరులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాడిన భాష అభ్యంతరకరంగా ఉందని మండిపడ్డారు.
రైతులను అలా పోల్చుతారా?
రైతులను ఉగ్రవాదులతో పోల్చడం సమంజసమేనా? అని ప్రశ్నించారు. భాజపానే ఉగ్రవాదుల కర్మాగారంగా మారిందని ఆరోపించారు. బండి సంజయ్ వెంట రైతులు ఎవరూ లేరని.. కిరాయి మూకలతో ఆర్మూరు వెళ్లారని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. పసువుబోర్డు తెస్తానన్న హామీ నిలబెట్టుకోనందుకే.. పార్లమెంటు నియోజకవర్గమంతటా అర్వింద్‌ను రైతులు నిలదీస్తున్నారన్నారు.
భాజపాది చెడగొట్టే విధానం
బండి సంజయ్‌కి దమ్ముంటే పసుపుబోర్డు తీసుకురావడంపై ఆలోచించాలని సవాలు విసిరారు. కేసీఆర్‌ది తెలంగాణను నిలబెట్టే విధానమైతే... భాజపాది చెడగొట్టే విధానమని జీవన్ రెడ్డి ఆరోపించారు. వైద్య సేవలు మెరుగుపరిచేందుకు జిల్లాలకు వెళ్తున్న మంత్రి హరీశ్ రావును భాజపా అడ్డుకోవడాన్ని రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని దుయ్యబట్టారు. భాజపా నేతలపై చట్టప్రకారం కేసులు పెడతామన్నారు.
'రైతులను ఉగ్రవాదులతో పోల్చడం సమంజసమా?.. ఎంపీ అర్వింద్‌ను రైతులు ఇప్పటికి చాలాసార్లు అడ్డుకున్నారు. ఎన్నికల ముందు ఆయన బాండ్ పేపర్ రాసిచ్చారు. పసుపు బోర్డు తెస్తానని మాట ఇచ్చారు. ఇప్పటివరకు బోర్డు తీసుకురాకపోవడంతో రైతులు నిలదీస్తున్నారు. సీఎం కేసీఆర్‌ది తెలంగాణను నిలబెట్టే విధానం. భాజపాది చెడగొట్టే విధానం. సీఎం కేసీఆర్ పట్ల భాజపా నేతలు భాష మార్చుకోవాలి. లేదంటే తెరాస సైన్యం ఊరుకోదు.'
-జీవన్ రెడ్డి, ఆర్మూరు ఎమ్మెల్యే
ఇదీ చదవండి: KTR In Rangareddy district : రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి దిక్సూచి : కేటీఆర్