ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలని రహదార్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంజినీర్లను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులపై మంత్రి హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని నియోజకవర్గాల వారీగా పెండింగ్ ప్రాజెక్టుల పురోగతితో పాటు కొత్త ప్రాజెక్టుల స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లోని గ్రామాలకు ఎస్సారెస్పీ నుంచి సాగునీరు అందించేలా ఎత్తిపోతల నిర్మాణం కోసం రూపొందించిన నమూనాపై సమావేశంలో చర్చించారు. గుత్ప ఆయకట్టుతో పాటు లిఫ్టుల కింద ఉన్న ఆయకట్టుకు పూర్తిగా నీరు అందించేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
చౌట్పల్లి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతలలోని లోపాలను సరిచేసి...దాని పరిధిలోని అన్ని గ్రామాలకు నీరివ్వాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు. నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల్లో 21వ ప్యాకేజీకి చెందిన పైప్ లైన్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఇంజినీర్లను ఆదేశించారు. జుక్కల్ నియోజకవర్గంలోని నాగమడుగు ఎత్తిపోతలకు ముఖ్యమంత్రి త్వరలో శంకుస్థాపన చేస్తారన్న మంత్రి... చెక్ డ్యామ్ ప్రాంతం, అప్రోచ్ కాల్వ పొడవు, పంప్ హౌస్ ప్రాంతాలను త్వరగా నిర్ణయించాలని చెప్పారు. వీలైనంత తక్కువ భూసేకరణ అవసరమయ్యేలా డిజైన్ సిద్ధం చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:ప్రశ్నించే గొంతుకలకు తెరాస బెదిరింపులు: సీఎల్పీ నేత భట్టి