KTR TOUR: తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయల్దేరి.. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్‌కు రానున్నారు. 10.30 గంటలకు సిద్ధాపూర్లో రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన, 10.45 గంటలకు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 11 గంటలకు బహిరంగ సభలో పాల్గొని, మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు.
పక్కాగా ఏర్పాట్లు..
కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో మాట్లాడారు. భద్రతా పరమైన అంశాలపై పోలీస్ కమిషనర్ నాగరాజు సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
రూ.119.41 కోట్ల అంచనా వ్యయం..
Siddapur Reservoir: నిజామాబాద్ జిల్లా వర్ని మండల పరిధిలోని చద్మల్, పైడిమల్, నంకోల్ చెరువుల సామర్థ్యం పెంపు, కాలువల ఏర్పాటు కోసం రూ.119.41 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతోన్న సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ తన చేతుల మీదుగా నేడు శంకుస్థాపన చేయనున్నారు. కేటీఆర్ పర్యటనలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
ఇదీ చూడండి: కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్రం స్పందన.. అపోహలు- వాస్తవాలు పేరిట ప్రకటన..