KTR responded To Kamareddy Master Plan: కామారెడ్డి మాస్టర్ ఫ్లాన్పై వినతులు, అభ్యంతరాలు ఉంటే పరిగణలోకి తీసుకోవాలని సంబంధిత అధికారులకు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన పట్టణ ప్రగతి సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి మాస్టర్ ఫ్లాన్ నిరసనలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అదనపు కలెక్టర్‌ను అడిగి ఈ విషయంపై ఆరా తీశారు.
కామారెడ్డి పారిశ్రామిక వాడకు సంబంధించి మాస్టర్ ఫ్లాన్ ఇంకా ఖరారు కాలేదని.. ఇది కేవలం ముసాయిదా మాత్రమేనని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటుందని.. దీనిపై ఎటువంటి సందేశాలు అవసరంలేదని పేర్కొన్నారు. ఈ ముసాయిదా విషయంలో అభ్యంతరాలు ఉంటే మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు.
అసలు ఈ మాస్టర్ ప్లాన్ గొడవ ఏమిటి: రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపాలిటీ బృహత్ ప్రణాళికను దిల్లీకి చెందిన ఓ సంస్థతో ఇటీవల తయారు చేయించారు. కామారెడ్డి పట్టణంతో పాటు విలీన గ్రామాలైన అడ్లూర్, టెకిర్యాల్ , కాల్సిపూర్, దేవునిపల్లి, లింగాపూర్, సరంపల్లి, పాతరాజంపేట, రామేశ్వరపల్లిని కలుపుకుని 61.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మాస్టర్ ప్లాన్ ముసాయిదా తయారు చేశారు. మొత్తం పట్టణాన్ని ఇండస్ట్రియల్, గ్రీన్, కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్లుగా విభజించి.. ఆ వివరాలను ఈ మధ్యే ప్రకటించారు.
2023 జనవరి 11 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు చెప్పారు. పారిశ్రామిక జోన్ కోసం 1200 ఎకరాలతో 8.5 శాతం ప్రతిపాదించారు. ఇందులో నేషనల్ హైవే పక్కన పచ్చని పంటలు పండే.. అడ్లూర్, ఇల్సిపూర్, టెకిర్యాల్, అడ్లూర్ ఎల్లారెడ్డి రైతులకు చెందిన 900 ఎకరాల భూములను చూపారు. దీనివల్ల ఈ భూములు రెసిడెన్షియల్ కింద పనికిరావని చెప్పకనే చెప్పినట్లయ్యింది. ఈ భూములకు ఒక్కసారిగా డిమాండ్ పడిపోయింది. భవిష్యత్‌లో ఇళ్ల నిర్మాణం కూడా కష్టమవుతుందని భావించిన రైతులు ఆందోళనబాట పట్టారు.
"కామారెడ్డిలోని కొన్ని ప్రాంతాల్లో 500 ఎకరాలు ఇండస్ట్రీయల్ జోన్లోకి పడ్డాయి. అక్కడ కొంత మంది రైతులు ఆందోళన చేస్తున్నారు. ఒక రైతు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ప్రభుత్వం ప్రజలకు సాయం చేయడానికి ఉంది.. అంతేగానీ ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదు. తెలంగాణలోని నగరాలు పద్ధతి, ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చెందిస్తున్నాము. దీనిలో భాగంగానే మాస్టర్ ఫ్లాన్లు తయారు చేస్తున్నాము. మాస్టర్ ఫ్లాన్లు ప్రజలు అనుకూలంగా.. అర్థవంతంగా ఉండాలి తప్ప ప్రజలకు వ్యతిరేకంగా ఉండకూడదు. ప్రజల నుంచి ఎక్కడైనా అభ్యంతరాలు అనేవి వస్తే వెంటనే వాటి అన్నింటిని క్రోడీకరించి.. అధికారులతో మాట్లాడాలి. ప్రజలు మీకు సలహాలు ఇస్తే వాటిని సమగ్రంగా సమీకరించండి. ఎవరు ఒత్తిడి చేసిన పట్టించుకోవద్దు. కామారెడ్డి లాంటి ఉదంతాలు ఎక్కడైనా ఉంటే వాటి అన్నింటిని దృష్టిలో పెట్టుకుని.. మాస్టర్ ఫ్లాన్లు సిద్ధం చెయ్యండి. మాస్టర్ ఫ్లాన్లు అన్నింటిని ఈ సంవత్సర కాలంలోనే పూర్తి చేయాలి." - కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి
ఇవీ చదవండి: