Harish Rao Comments: రాష్ట్రంలో పంటల సమృద్ధిని చూసి కేంద్రానికి కడుపు మంటగా ఉందని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రంలో ధాన్యం ఈ స్థాయిలో పండుతోందన్న హరీశ్.. ధాన్యం చూసి కేంద్ర మంత్రులే ఆశ్చర్యపోతున్నారన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండంలో జాకోరా ఎత్తిపోతల పథకానికి సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. పోచారం శ్రీనివాస రెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉండటం.. ఇక్కడి ప్రజల అదృష్టమని హరీశ్ అన్నారు. ప్రజలకు ఏం కావాలో ఆయనకు తెలుసని స్పష్టం చేశారు.
జాకోరా ఎత్తిపోతలతో కష్టాలు తీరతాయని ఇక్కడికొచ్చిన ప్రజల కళ్లలో ఆనందం కనపడుతోందని హరీశ్ అన్నారు. జాకోరా లిఫ్ట్ చూసి విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో నిజాం నవాబులు కట్టిన ప్రాజెక్టులు తప్ప.. ఈ ఏడు దశాబ్దాల్లో గత ప్రభుత్వాలు కట్టినవి ఏవీ లేవని పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని భాజపా హామీ ఇచ్చిందన్న హరీశ్.. ఆదాయం సంగతేమో కానీ.. రైతుల పెట్టుబడులను మాత్రం కేంద్రం రెట్టింపు చేసిందని ఎద్దేవా చేశారు.
"గతంలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు చేసే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు కాళేశ్వరం, సింగూరు వంటి ప్రాజెక్టులతో ఆకాశం వైపు చూసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ కొరత, ఎరువుల కొరత ఉండేది. రాష్ట్రంలో పంటల సమృద్ధిని చూసి కేంద్రానికి కడుపు మంటగా ఉంది. రైతుల పొలాలకు జలాలొస్తుంటే.. విపక్షాలకు కన్నీళ్లొస్తున్నాయి. అన్నదాతలకు మేలు చేస్తే ఓర్వలేకపోతున్నారు. బాయిల్డ్ రైస్ కొనరంట.. రా రైస్ కావాలంట?.. ఈ యాసంగిలో రా రైస్ పండుతదా?." -హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి
అంతకుముందుగా బాన్సువాడలో రూ. 40 కోట్ల వ్యయంతో నిర్మించే నర్సింగ్ కళాశాలకు పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి హరీశ్ రావు భూమిపూజ చేశారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి పోచారం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు హరీశ్ పేర్కొన్నారు. భవిష్యత్‌లో నిజాంసాగర్ ఎల్లప్పుడూ నిండుకుండను తలపించేలా చర్యలు చేపట్టినట్లు హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రం కాకుండా బాన్సువాడలో నర్సింగ్ కళాశాలకు అనుమతి ఇవ్వటంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పోచారం కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చదవండి: 'ఏపీలో కరెంట్, నీళ్లు, రోడ్లు ఏమీ లేవు.. అక్కడ ఉండలేక హైదరాబాద్ వస్తున్నారు..'
ఇది ట్రైలర్ మాత్రమే.. సినిమా ఇంకా మిగిలే ఉంది: నితిన్ గడ్కరీ