కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్రం ఆత్మ నిర్భర్ భారత్ పథకాన్ని తీసుకొచ్చింది. పలు రంగాలకు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వ్యవసాయ రంగానికి రూ.లక్ష కోట్లు కేటాయించింది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, ఇతర సదుపాయాల కోసం ఖర్చు చేయాల్సి ఉంది. ఇందుకు నాబార్డు ద్వారా రుణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఆయా ప్రాంతాల్లో పండే పంటల ఆధారంగా సహకార సంఘాలు యూనిట్లు నెలకొల్పేందుకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు.
ఇలా చేస్తే అందరికీ ప్రయోజనం
*● పసుపు సాగుకు ఇందూరు ప్రసిద్ధి. వ్యాపారులు కొనుగోలు చేసి పసుపు ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నారు. సహకార సంఘాలే కొనుగోలు చేసి సొంత బ్రాండ్‌పై విక్రయించుకోవచ్ఛు తద్వారా రైతుకు మార్కెట్ సౌకర్యం ఏర్పడుతుంది. వినియోగదారుడికి తక్కువ ధరకే అందించొచ్ఛు
*● కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో పప్పుధాన్యాల సాగు ఎక్కువ. ఇక్కడ ఉత్పత్తి అయిన కందులు, మినుములు, పెసర్లను మహారాష్ట్ర వ్యాపారులు తీసుకెళ్తున్నారు. వాటిని పప్పులుగా మార్చి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. జిల్లాలోని సహకార సంఘాలే పప్పు మిల్లులను ఏర్పాటు చేసుకొంటే లాభాలు పొందడానికి వీలుంటుంది.
*● మక్కలతో కార్న్, చిప్స్ తయారు చేసి కొన్ని సంస్థలు ఇప్పటికే విక్రయిస్తున్నాయి. వీటి పిండిని బిస్కట్ తయారీలోనూ వాడతారు. ఈ యూనిట్లను సహకార సంఘాలు ఏర్పాటు చేస్తే స్థానికంగా కొందరికి ఉపాధి లభించటంతో పాటు మొక్కజొన్న పంటకు మంచి ధర లభిస్తుంది.
*● ఎర్రజొన్న సాగుకు ఆర్మూర్ ప్రాంతం ప్రసిద్ధి. ఉత్తర భారత దేశానికి పశుగ్రాసాన్ని అందించే పంట విత్తనాల సాగుకు ఈ ప్రాంతం అనుకూలం. ఎక్కువ కాలం నిల్వ చేయలేని పరిస్థితి ఉండటంతో తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. శీతల గిడ్డంగులు ఉంటే వాటిలో నిల్వ చేసుకోవచ్ఛు. ధర పెరిగాక విక్రయిస్తే రైతులకు లాభం వస్తుంది.
*● ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ధాన్యం ఉత్పత్తిలో మొదటి, రెండు స్థానాల్లోనే ఉంటోంది. బియ్యం మిల్లుల సామర్థ్యం సరిపోక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సహకార సంఘాలు వీటిని నిర్మించుకొంటే ఈ కొరత తీరుతుంది.
● సోయా నుంచి నూనె, పాలు తీసి విక్రయించొచ్ఛు మీల్‌మేకర్, కేకు వంటి పదార్థాలుగా తయారు చేస్తారు. నైపుణ్యం కలిగిన వారి సలహాలతో ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పితే ఉమ్మడి జిల్లాలో పెద్దమొత్తం విస్తీర్ణంలో సాగవుతున్న సోయాకు గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంది.
మంచి అవకాశం
నిజామాబాద్ జిల్లాలో 89, కామారెడ్డి జిల్లాలో 55 సహకార సంఘాలున్నాయి. వీటిల్లో కొన్ని మాత్రమే బకాయిలు కలిగి ఉన్నాయి. చాలావరకు పంటల కొనుగోళ్ల నిర్వహణతో ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. పంట ఉత్పత్తులు నిల్వ చేసేందుకు గోదాములు, శీతల గిడ్డంగుల కొరత ఉండటాన్ని గమనించాం. సొసైటీల ఆధ్వర్యంలో వీటిని నిర్మించేందుకు రుణాల కోసం ప్రయత్నించాం. పూచికత్తుల సమస్య వస్తోంది. అదీగాక ఏదైనా యూనిట్ ఏర్పాటు చేయాలంటే కనీసం రెండు ఎకరాల స్థలం సంఘం పేరిట ఉండాలి. ఈ దిశగా అధికారులు కొంత కాలంగా ప్రయత్నాలు చేశారు. కొన్ని సంఘాలు భూమిని సమకూర్చుకోగలిగాయి. కేంద్రం అందించే నిధులు వినియోగించుకోవటానికి వీటికి మంచి అవకాశం. - సింహాచలం, డీసీవో నిజామాబాద్
నిర్వహణ సామర్థ్యాలు చూస్తాం
కేంద్రం ప్రకటించిన రుణాలను అందించే క్రమంలో ఆయా సొసైటీలు సంబంధిత యూనిట్లు నిర్వహించగలవా అనేది చూస్తాం. స్థానికంగా వ్యవసాయ మార్కెటింగ్ మౌలిక సదుపాయాల నిధి వినియోగంలో త్వరలోనే పూర్తి స్థాయి సూచనలు అందుతాయి. ప్రస్తుతం నియంత్రిత వ్యవసాయం అమలు చేయనున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్తాం. సహకార సంఘాల్లో కంప్యూటరీకరణ కావాల్సిన ఆవశ్యకత ఉంది. అప్పుడే ఆర్థిక సంబంధమైన లావాదేవీల నిర్వహణ జాగ్రత్తలతో కూడుకొని, సులభతరంగా ఉంటుంది. - నగేష్, నాబార్ డీడీఎం