నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని బుస్సాపూర్ సావేల్ సహకార సంఘం చేసిన వరి ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరిగాయని దూదిగాంకు చెందిన రైతులు ఆందోళనకు దిగారు. రైతుల వద్ద చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం... కర్తా పేరుతో ఒక్కో సంచికి 12 కిలోల వరకు తరుగు తీసిందని వాపోయారు. తాము పంపించిన ధాన్యానికి, వచ్చిన డబ్బులకు చాలా తేడాలు ఉన్నాయని ఆరోపించారు. ఇవి సొసైటీ పరిధిలో తేడాలా లేక రైస్ మిల్లర్ల మాయాజాలమో తేల్చాలని రైతులు డిమాండ్ చేశారు.
సొసైటీ పరిధిలో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేదని సహకార సంఘం ఛైర్మన్ నాగంపేట శేఖర్ రెడ్డి తెలిపారు. పూర్తి పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కర్తా వివరాలు ముందుగానే తెలియజేశామని వివరించారు. రైస్ మిల్లుల వద్ద ఏమైనా లోపాలు ఉంటే సరిచేసి రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు.